హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నేరచరిత్ర కలిగి ఇప్పటికే పోలీసుల బైండోవర్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులను నియంత్రించాలని, పోలింగ్ రోజున ఓటర్లను బెదిరించే అవకాశమున్నందున వారిని పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో బీఆర్ఎస్ నేతలు సోమవారం సీఈవో సుదర్శన్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు నేరచరిత్ర ఉన్నదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో లైసెన్స్ ఉన్న ఆ యుధాలు కలిగి ఉన్నారని, ఆయనపై అనేక వారంట్లు ఉన్నాయని, అనేకమందిని బెదిరించిన ఉదంతాలు ఉన్నాయని వివరించారు. అలాగే నవీన్‌యాదవ్ సోదరుడు ఇటీవల బీఆర్ఎస్ నాయకులను బెదిరించారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడటాన్ని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలింగ్ రోజున నేరచరితులను బయట తిరుగకుండా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌గౌడ్, రామచంద్రునాయక్, బీఆర్ఎస్ అడ్వకేట్లు శ్రీకాం త్, కిరణ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.