హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ‘మేము హామీ ఇచ్చేనాటికి బంగారం విలువ తులానికి రూ.50 వేలు మాత్రమే ఉండె.. కానీ, ఇప్పుడు తులం బంగారానికి లక్షన్నర అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు చెప్పేముందు ధర ఒకలా ఉన్నది. ఇప్పుడు మరోలా మారింది. ఈ ధరలో కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi) తులం బంగారం ఇవ్వలేం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చేతులెత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకు తులం బంగారం ఇవ్వాలనుకోవడం లేదని స్పష్టంచేశారు. ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, దీంట్లో పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకంలో భాగంగా రూ.లక్ష నగదు, తులం బంగారం కూడా ఇస్తామని చెప్పామని వివరించారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పేర్కొన్నామని, అయితే, తాము హామీ ఇచ్చేనాటికి బంగారం విలువ తులానికి రూ.50 వేలు మాత్రమే ఉండేదని, ఇప్పుడు లక్షన్నర అయినందున బంగారం ఇవ్వాలనుకోవడం లేదని కుండబద్దలు కొట్టారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ల పెంపు అంశంపైనా మంత్రి పొన్నం స్పష్టత ఇవ్వలేదు. రూ. నాలుగు వేల పెన్షన్ కూడా ఇవ్వాలనుకున్నామని, ఇప్పటికైతే ఇవ్వలేకపోయామని, ప్రతి మహిళకు 2500 కూడా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, భవిష్యత్తులో ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.