దుబ్బాక, నవంబర్ 3: సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు సోమవారం ఆందోళనకు దిగా రు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరు పెట్టుకున్నారు. మరో పక్క అకాల వర్షం వల్ల యార్డులో ధాన్యం తడిసి మొలకలొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఏఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన రైతులు అనంతరం పట్టణంలోని ఛత్రపతి శివాజీ చౌరస్తా వద్దకు చేరుకుని రాస్తారోకో చేశారు.
సుమారు రెండు గంటలకుపైగా రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేశారు. తహసీల్దార్ సంజీవ్‌కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై కీర్తిరాజు ఘటన వద్దకు చేరుకుని రైతులను సముదాయించినా ఫలితం లేకుండాపోయింది. మొలకెత్తిన ధాన్యం చూపిస్తూ రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్‌లో తడిసిన ధాన్యం కొనుగోలు చేశారని, దుబ్బాకలో ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ కేవలం హుస్నాబాద్‌కే మంత్రా లేక రాష్ర్టానికా అంటూ ప్రశ్నించారు. సిద్దిపేట కలెక్టర్ వచ్చే వరకూ తమ నిరసన కొనసాగుతుందన్నారు.
ఎట్టకేలకు పోలీసులు రైతులను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య స్వల్ప ఉద్రికత్త వాతావరణం నెలకొంది. అనంతరం రైతులతో కలిసి తహసీల్దార్, పీఏసీఎస్ సిబ్బందితో మార్కెట్‌యార్డుకు వెళ్లి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నాగవ్వ అనే మహిళా రైతు తడిసిన ధాన్యం చూపి స్తూ కొనుగోలు చేయాలంటూ తహసీల్దార్ సంజీవ్‌కుమార్ కాళ్లపై పడింది. సారు మీ కాళ్లు మొక్కు తా వడ్లు కొనుగోలు చేయాలని వేడుకుంది. తేమశాతం 16 వచ్చినా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
దుబ్బాక మార్కెట్ యార్డుకు ధాన్యం తెచ్చి 20 రోజులు అవుతుంది. కొనుగోలు చేయకపోవడంతో వానపడి వడ్లు మొలకలు వచ్చాయి. ఐదు ట్రాక్టర్ల వడ్లు తడిసిపోయాయి. రోజూ అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మా ధాన్యం కొనేదెట్లా..? గిట్టుబాటు ధర కోసం మార్కెట్ యార్డుకు వస్తే… ఉన్న వడ్లు తడిశాయి. ప్రభుత్వం
తడిసిన వడ్లను కొనుగోలు చేసి ఆదుకోవాలి. హుస్నాబాద్‌లో తడిసిన ధాన్యం తీసుకున్నారు, దుబ్బాకలో ఎందుకు తీసుకోవడం లేదు.
– కాల్వ మణెమ్మ రైతు దంపతులు, దుబ్బాక