హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఉప ఎన్నికలో విజయదుందుభి మోగించేందుకు పదునైన ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే ఏం చేయాలో తోచక కాంగ్రెస్ శ్రేణులు హైరానా పడుతున్నాయి. ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ‘హస్తం’ నేతలు తల పట్టుకుంటున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి రంగం సాధించిన ప్రగతిని బీఆర్ఎస్ శ్రేణులు కండ్లకు కట్టినట్టు చూపిస్తుంటే.. రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో ఎటుచూసినా హైదరాబాద్‌లో హైడ్రా విధ్వంసమే దర్శనమిస్తున్నది. ప్రజలకు ఏం చెప్పాలనే దానిపై క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు, చివరికి మంత్రులకు కూడా స్పష్టత లేక దిక్కులు చూస్తున్నారు. ప్రచారానికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఓ వృద్ధురాలు నిలదీసిన ఉదంతమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి రెండేండ్లయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఒక్క హామీని నెరవేర్చకపోవడంపై రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించే వాతావరణాన్ని బీఆర్ఎస్ తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్ ప్రజలు తమకు ఏం కావాలో, కాంగ్రెస్ నుంచి ఏం రాబట్టాలో అనే విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉన్నట్టు ఇక్కడ ప్రచార సరళిని మొదటి నుంచీ గమనిస్తున్నవారు చెప్తున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాడు చల్లారక ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని జూబ్లీహిల్స్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న గోపీనాథ్ సతీమణి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఏం మాట్లాడాలో తెలియక మాటలు వెతుక్కుంటున్న పరిస్థితుల్లో ఏకంగా మంత్రులే ఆమెపై నోరుపారేసుకున్నారు. ఓట్ల కోసం ఆమె ఎడుస్తున్నదని నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇది జూబ్లీహిల్స్ ప్రజల మనసును గాయపరచిందని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు.
బీఆర్ఎస్పై, ప్రత్యేకించి పార్టీ అధినేత కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న ఆదరణ గులాబీ శ్రేణులకు బలంగా మారింది. పదేండ్ల పాలనలో కేసీఆర్ చేసిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తూ 23 నెలలుగా కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు చేస్తున్న ఉద్దేశపూర్వక దాడిని తిప్పికొడుతూ బీఆర్ఎస్ సైనికులు ముందుకు పోతున్నారు. కేసీఆర్ పాలనకు, రేవంత్‌రెడ్డి పాలనకు మధ్య ఉన్న తేడాను ఇల్లిల్లూ తిరుగుతూ వివరిస్తున్నారు. రహమత్‌నగర్, యూసఫ్‌గూడ, షేక్‌పేట వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సందర్భాల్లో ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు కవచంగా నిలుస్తున్నారు. ‘మీరు తిరిగినా తిరగకపోయినా మేం తిరిగి నిలబడతం’ అని ధైర్యాన్ని ఇస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణాన్ని అన్నికోణాల్లో విశ్లేషించుకొని మంత్రులు, నాయకులు ఒక్కొక్కరుగా ప్రచారం నుంచి జారుకుంటున్నట్టు సాక్షాత్తు కాంగ్రెస్ శ్రేణులే చెప్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తనకే సంబంధం లేదన్నట్టుగా మంత్రి సీతక నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లారు. మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి లాంటి వాళ్లు ప్రచారానికి వచ్చి వాస్తవ పరిస్థితిని చూసి ‘జూబ్లీహిల్స్ ప్రభావం ప్రభుత్వంపై ఏమాత్రం పడదు’ అన్నట్టుగా వ్యాఖ్యానించారు. ప్రచారానికి వచ్చిన మంత్రి జూపల్లిని ఓ వృద్ధురాలు నిలదీసిన తరువాత ఏం చెప్పాలో తెలియక అక్కడినుంచి ఆయన జారుకున్నారు. ‘ఇక మనం ఏం చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు వినేలా లేరు’ అనే నిర్దారణకు కాంగ్రెస్ నేతలు వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి కావడం వల్ల ఎవరికి తప్పినా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తప్పదు కదా అని ఆయన అనుచరులు వాపోతున్నారు. ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులను ప్రజలు ఎకడికకడ నిలదీస్తున్నారు. రెండేండ్లలో తమకు ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ కేడర్‌లో నైరాశ్యం.. గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది.