మంచాల, మార్చి 4 : చెడు వ్యసనాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని ఇబ్రహీపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ గ్రామంలో మంగళవారం నాడు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్, ఆన్లైన్ గేమ్ తదితర వాటిపై యువత, విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈసందర్భంగా ఏసీపీ కేపీవీ రాజు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత చెడు మార్గాల వైపు వెళ్లకూడదని అన్నారు. ముఖ్యంగా గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్, ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటుపడితే కుటుంబాలు వీధిన పడుతాయని తెలిపారు. పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండటమే కాకుండా.. వారికి సాధ్యమైనంత వరకు ఫోన్ ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. పోలీసులు నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తారని.. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లాలయ్య, ఏఎస్సై సతీశ్ తదితరులు పాల్గొన్నారు.