2021 రౌండప్
యాదాద్రికి తిరుమల స్థాయి భద్రత
కౌన్సెలింగ్‌తో 1029 కుటుంబాలను కలిపాం
57 శాతం కేసుల ఛేదన.. 72 శాతం రికవరీ
3514 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాం
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడి
వార్షిక నివేదిక విడుదల
సిటీబ్యూరో, డిసెంబర్ 27: ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ ఏడాది పని చేశామని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అన్నారు. సోమవారం ఎల్బీనగర్లోని ఓ కన్వెన్షన్‌లో 2021-వార్షిక నివేదికను విడుదల చేశారు. అభివృద్ధితో పాటు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసింగ్‌ను అందించి.. ప్రజలకు పూర్తి భద్రతా పరమైన వాతావరణాన్ని అందించినట్లు సీపీ చెప్పారు. 78 శాతం కేసుల మిస్టరీని ఛేదించి.. వాటన్నింటి విచారణను కొనసాగిస్తున్నామని వివరించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ అధికారులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి అందించిన సహకారానికి సీపీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, యాదాద్రి-భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ఎస్వోటీ డీసీపీ సురేందర్‌రెడ్డి, షీ టీమ్స్ డీసీపీ సలీమా, రాచకొండ అడ్మిన్ డీసీపీ శిల్పవలి పాల్గొన్నారు. అనంతరం వార్షిక నివేదికలో ఈ ఏడాది సాధించిన విజయాలు, ఇతర అంశాలను సీపీ వివరించారు.
గంజాయిపై యుద్ధం
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపారు. ఈ ఏడాది 5779 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 93 కేసులను నమోదు చేసి 175 మంది నిందితులను అరెస్టు చేశారు. రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నేరస్తులు, మత్తు దందాను చేసే వారు, ఇతర వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన 2067 మందిని అరెస్టు చేసి.. వారిపై 766 కేసులను నమోదు చేసింది. ఈ ఏడాది మనుషుల అక్రమ రవాణాపై మొత్తం 75 కేసులను నమోదు చేసి 198 మంది నిందితులను పట్టుకోగా 249 మందిని కాపాడారు. 56 మంది వ్యభిచార నిర్వాహకులపై పీడీ యాక్ట్‌ను విధించారు. పలు వ్యభిచార గృహాలను సీజ్ చేశారు. ఆపరేషన్ స్మైల్,ముస్కాన్ ద్వారా వెట్టిచాకిరీ చేస్తున్న 459 మంది బాధితులను కాపాడారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 2 వేల మందికి పైగా సిబ్బంది కరోనా బారిన పడగా, వారందరికీ వెనువెంటనే వైద్య సేవలు, నగదు, మందులను అందించడంతో త్వరగా కోలుకొని విధుల్లోకి వచ్చారు.
సీసీ కెమెరాలు..
సీసీ కెమెరాలతో కమిషనరేట్ పరిధిలో 8694 ప్రదేశాలను క్రైం మ్యాపింగ్ చేశారు. 38 కీలక కేసుల్లో సీసీ కెమెరా దృశ్యాలను మెరుగు పర్చి కేసు ఛేదనకు సహకరించారు. 147 కేసుల్లో విశ్లేషణను చేసి ఐటీ అధికారులు మిస్టరీ వీడేందుకు తోడ్పడ్డారు. ప్రతి పోలీసు స్టేషన్లో సీసీ కెమెరాల పని తీరుపై డీఎస్‌ఆర్‌ను తీసుకుంటున్నారు. సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తున్నారు. వాట్సాప్, డయల్ 100 ద్వారా 91 మంది ప్రాణాలను కాపాడారు. మొత్తం వివిధ సోషల్ మీడియా వేదికల మీదుగా 5630 మంది ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కారమయ్యాయి. రాచకొండ ట్విట్టర్ ఖాతాను 1.50 లక్షల మంది పౌరులు ఫాలో అవుతున్నారు. ఇక 9490617111 నంబరకు చాలా మంది మహిళలు కాల్స్ చేసి.. పోలీసు సేవలను పొందుతున్నారు.
మహిళా పెట్రోలింగ్…
కొత్త సంవత్సరంలో కమిషనరేట్ పరిధిలో మహిళలతో కూడిన పెట్రోలింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. దీంతో ఏ సమయమైనా.. మహిళలకు రక్షణగా ఈ బృందాలు అందుబాటులో ఉండనున్నాయి.
1029 కుటుంబాలు..
రాచకొండ షీ టీమ్స్ మహిళలు, విద్యార్థినులు, యువతులకు భద్రతను కల్పిస్తూనే మరో వైపు వివిధ అంశాల్లో దంపతుల మధ్య చోటు చేసుకున్న విబేధాలను కౌన్సెలింగ్ ద్వారా ఏకం చేశారు. షీ టీమ్స్ ఈ ఏడాది ఈవ్ టీజింగ్‌కు సంబంధించి మొత్తం 140 ఎఫ్ఐఆర్, 188 పెట్టీ, 27 కౌన్సెలింగ్ కేసులను నమోదు చేశారు. 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే వారికి సేవలను అందించి.. రక్షణకు చర్యలు తీసుకుంది. మొత్తం 31 బాల్య వివాహాలను ఆపారు. 3514 డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించారు. పసిపిల్లల విక్రయాలను అడ్డుకున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా..
నిబంధనలను పాటించని వాహనాదారులపై 18.33 లక్షల కేసులను నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో 580 మందిని జైలుకు పంపగా, మిగతా వాహనదారులపై రూ. 2.02 కోట్ల జరిమానాలను విధించారు. ఈ ఏడాది 2615 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 642 మంది చనిపోయారు. 2584 మంది గాయపడ్డారు. అత్యధికంగా హెల్మెట్ ధరించని 15.33 లక్షల మంది వాహనదారులపై చలాన్లు విధించారు. మొత్తం 45 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి 39 చోట్ల మరమ్మతులు చేపట్టారు.
123 శాతం పెరిగిన సైబర్ క్రైం…
ఈ ఏడాది 123 శాతం సైబర్ నేరాలు పెరిగాయి. సైబర్ క్రైం నేరాల్లో బాధితులు మోసపోకుండా వారికి సత్వర సేవలను అందించే ఉద్దేశంతో పోలీస్స్టేషన్లలో సైబర్ సెల్ యూనిట్లను ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. నైజీరియన్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, ఏటీఎం క్లోనింగ్, సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఇతర నేరాలకు సంబంధించి మొత్తం 1173 కేసులు నమోదయ్యాయి. వీటిలో 116 మంది నిందితులను అరెస్టు చేయగా రూ. 3.8 కోట్ల నగదు బ్యాంక్‌లు, వాలెట్లలో ఫ్రీజ్ చేశారు. రూ. 2.2 కోట్లను బాధితులకు అందించారు. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా నమోదైన ఫిర్యాదుల సంఖ్య 3291.. అందులో 1097 కేసుల్లో విచారణ, వాటిలో 257 ఫిర్యాదులపై కేసుల రిజిస్టర్, మరో 1937 ఫిర్యాదుల ప్రక్రియ కొనసాగుతున్నది.
9 శాతం పెరిగిన క్రైం రేటు
సొత్తు కోసం హత్యలు, వాహనాల చోరీలు, సాధారణ దొంగతనాలు, దృష్టి మళ్లించి జరిగిన నేరాలు, వరకట్న వేధింపులు తదితర నేరాలపై ఈ ఏడాది మొత్తం 21,685 కేసులు నమోదయ్యాయి. 2019 ఏడాదికి పోలిస్తే 9 శాతం క్రైం రేటు పెరిగింది. ఈ కేసులన్నింటిలో పురోగతిని సాధించి 78 శాతం కేసులు విచారణకు సిద్ధమయ్యాయి.
తెలిసిన వారే నేరాలు చేశారు..
మహిళలపై జరిగే నేరాలు వరకట్నపు హత్యలు, వేధింపుల మరణాలు, ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా వేధింపులు, గృహహింస, మహిళల హత్యలు, లైంగిక దాడులు, కిడ్నాపింగ్, ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించడం తదితర కేసుల్లో మొత్తం ఈ ఏడాది 2446 కేసులు నమోదయ్యాయి. ప్రతి ఘటనలో తెలిసిన వారే నిందితులుగా ఉన్నారు. పోక్సో కేసులు ఈ సంవత్సరం 394 వరకు నమోదయ్యాయి. లైంగిక దాడుల అంశంలో నమోదైన 377 కేసుల్లో 368 మంది వారికి తెలిసిన వారే ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారని తేలింది.
రికవరీలో 72 శాతం పురోగతి..
సొత్తు కోసం హత్యలు, దోపిడీ, దొంగతనాలు, స్నాచింగ్, చోరీలు, సాధారణ దొంగతనాలు, దృష్టిమళ్లించిన నేరాలు, వాహనాల చోరీలకు సంబంధించి నమోదైన మొత్తం 659 కేసుల్లో 72 శాతం రికవరీ జరిగింది. కేసుల మిస్టరీని ఛేదించడంలో 57 శాతం పురోగతి సాధించారు.
227 మందికి..
కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మొత్తం 227 మంది నేరస్తులకు జైలు శిక్షలు పడ్డాయి. మొత్తం 8024 కేసుల విచారణ పూర్తయింది. అందులో 4413 కేసుల్లో నిందితులకు శిక్షలు, జరిమానాలు పడ్డాయి. ఇందులో 55 శాతం పురోగతి స్పష్టమైంది. 8 మందికి జీవిత ఖైదు, 8 మందికి 10 ఏండ్లు, 124 మంది ఏడాది శిక్షలు పడ్డాయి.
133 జీరో ఎఫ్ఐఆర్లు..
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకొని దానికి సంబంధించిన చర్యలను తీసుకోవడం లక్ష్యంగా పోలీసులు పని చేశారు. ఇలా వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన వాటిపై నమోదైన 133 ఫిర్యాదులపై జీరో ఎఫ్ఐఆర్లను నమోదు చేసి బాధితుల్లో భరోసాను నింపారు.