అనుమతుల ద్వారా వచ్చిన జీహెచ్ఎంసీకి ఆదాయం రూ.797.13 కోట్లు
కొవిడ్లోనూ జీహెచ్ఎంసీలో ఆగని నిర్మాణాలు
8 నెలల్లోనే 11,538 భవన నిర్మాణాలకు అనుమతులు
ఇందులో నివాస గృహాలు 11,372, కమర్షియల్ భవనాలు 149, వైద్యశాలలు, విద్యా సంస్థలు 17..
67 హైరైజ్ భవనాలకూ పర్మిషన్లు
నివాస గృహాలకు విపరీతమైన డిమాండ్
కొత్త ఇంటికి మారేందుకు ప్రజల ఆసక్తి
అత్యధికంగా ఇన్స్టాంట్ అప్రూవల్స్ నిర్మాణాలే
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం
రంగమేదైనా అభివృద్ధిలో నంబర్‌వన్ స్థానంలో నిలిచే హైదరాబాద్ రియల్ రంగంలోనూ దూసుకుపోతున్నది. ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీలకు సరసన నిలిచిన నగరంలో నిర్మాణ రంగం జోరు ఏ మాత్రం తగ్గలేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు సైతం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. భవన నిర్మాణాలు, లేఅవుట్లు వేసేందుకు అవసరమైన అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తడమే ఇందుకు నిదర్శనం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటి వరకు 11,533 భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 11,372 నివాస గృహాలు, కమర్షియల్ 149, వైద్యశాలలు, విద్యాసంస్థలు 11 ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మొత్తం అనుమతుల్లో ఏకంగా 67 హైరైజ్ (ఆకాశ హార్మ్యాలు) భవనాలు ఉండటం విశేషం. ఇక అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీకి రూ.797.13 కోట్ల ఆదాయం రాగా.. ఇందులో వాయిదా పద్ధతుల ద్వారా బిల్లర్డు, డెవలపర్లు చెల్లించిన మొత్తం రూ. 136 కోట్లు.
సిటీబ్యూరో, డిసెంబర్ 26 : గ్రేటర్లో నిర్మాణ రంగం జోరుమీదుంది. ఇందుకు నిదర్శనం జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,538 భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. దీంతో జీహెచ్ఎంసీకి రూ.797.13 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో వాయిదా పద్ధతుల ద్వారా రూ.136 కోట్లను బిల్డర్లు, డెవలపర్లు చెల్లించారు. కాగా 11,538 అనుమతుల్లో నివాస గృహాలు 11,372 ఉండ గా, 149 కమర్షియల్, 17 ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మొత్తం అనుమతుల్లో ఏకంగా 67 హైరైజ్ (ఆకాశహర్మ్యాలు) భవనాలు ఉన్నాయి. అదే సమయంలో జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత హెచ్ఎండీఏ పరిధిలోని పుప్పాల్‌గూడ, నార్సింగి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి 60 అంతస్తలతో నిర్మించే హైరైజ్ భవనాల నిర్మాణానికి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొన్నింటికీ ఇంకా అనుమతివ్వలేదు.
ఆశాజనకంగా రియల్ మార్కెట్
నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ట్రాఫిక్ అసెస్మెంట్ను పరిగణలోకి తీసుకొని అనుమతుల జారీ ప్రక్రియను చేపడుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 44 అంతస్తులతో కూడిన హైరైజ్ భవనం ఉండగా, హెచ్ఎండీఏ పరిధిలో 58 అంతస్తులతో కూడిన భవనం అత్యంత ఎత్తైనది ఉంది. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి వృద్ధి రేటు ఉంది.
వృద్ధిరేటు ఇలా..!
క్యూ1- 2020లో 2680 యూనిట్లు ఉంటే, క్యూ1-2021లో 12,620 యూనిట్లుగా ఉంది. అదే సమయంలో అమ్మకాల్లోనూ హైదరాబాద్ నగరంలో మంచి వృద్ధి రేటు ఉందని ప్రముఖ ప్రాపర్టీ సంస్థ అనరాక్ చైర్మన్ అనూజ్పూరీ తెలిపారు. ఇతర నగరాలతో పోల్చితే 64శాతం అధికంగా ఉంది.
క్యూ1-2020లో 2680 యూనిట్లు ఉంటే, క్యూ1-2021లో సుమారు 4400 యూనిట్లుగా ఉందని ఓ రియల్ వ్యాపార తెలిపారు.
చాలా మంది కొత్త ఇంటికి మారేందుకు ఆసక్తి చూపుతున్నారని, 50 శాతం రెండవ ఇంటి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. కొవిడ్ సమయంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంతో ఆశాజనకంగా ఉందని, నివాస గృహాలకు విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పారు.
అప్పటికప్పుడే అనుమతులు
75 గజాల్లోపు ఇండ్లకు రూ.1 కే నిమిషాల్లో అనుమతి పొందుతున్నారు. ప్రధానంగా 76 నుంచి 600 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందుతున్నారు. దీనిలోనే అత్యధికంగా అనుమతులు పొందుతున్నారు. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, భవనం ప్లాన్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే వీరికి ఆమోదం (ఇన్స్టంట్ అఫ్రూవల్) లభిస్తుంది. ఇలా స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి పొందిన స్థలాలను పరిశీలించేందుకు జోనల్ స్థాయిలో ప్రత్యేకంగా నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ పోస్ట్ వెరిఫికేషన్ జరుపుతున్నది. 21 రోజుల వ్యవధిలోనే అనుమతులు లభిస్తుండటం గమనార్హం. అయితే ఇందులో ముందుగా పేర్కొన్న ప్లాన్‌కు తగ్గట్టుగా నిర్మాణం చేపట్టకపోవడం, అనుమతి లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్‌బ్యాక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇటువంటి వాటిపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపి ఉక్కుపాదం మోపుతున్నారు.