IPL Producer Manasa Chennapragada | క్రికెట్లో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నా.. ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. అదో ఎమోషన్, టెన్షన్, అటెన్షన్! ఆ ఉద్వేగాలను వండివార్చి మనల్ని టీవీలకు కట్టిపడేసేవారే ఐపీఎల్ ప్రొడ్యూసర్స్. హైదరాబాద్ యువతి మానస చెన్నాప్రగడ ఆ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నది. ఐపీఎల్ ప్రొడ్యూసర్‌గా ‘ముంబై ఇండియన్స్ ’ను హ్యాండిల్ చేస్తున్న మానస మనసులోని మాట..
‘ఐపీఎల్ ప్రొడ్యూసర్.. అంటే ఏంటి?’ అని చాలామంది అడుగుతుంటారు నన్ను. మన వాళ్లకు ఆఫ్‌బీట్ కెరీర్ పట్ల అవగాహన తక్కువ. ఐపీఎల్ ప్రొడ్యూసర్, మేనేజర్‌గా పనిచేయడం ఓ అదృష్టంగా భావిస్తున్నా. క్రికెటర్లను ఒక స్థాయిలో నిలబెట్టే కీలక పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. బీసీసీఐ డాక్యుమెంటరీకి మేం ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తాం. చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి జట్లను బీసీసీఐ ప్రొడ్యూసర్స్‌కు అప్పగిస్తుంది. ఐపీఎల్ ఒక వాణిజ్య సినిమా లాంటిది. అది బీసీసీఐ సమర్పణలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటుంది. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు కాబట్టి ప్రమోషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి. బీసీసీఐ డాక్యుమెంటరీ ఆ మార్కెటింగ్ వ్యూహంలో కీలకపాత్ర పోషిస్తుంది. వివిధ మాధ్యమాల ద్వారా లక్షలమంది క్రికెట్‌ను వీక్షిస్తారు. ఆటతోపాటు ఆటగాళ్ల నడత, నడవడిక కూడా బ్రాండ్‌ను ప్రభావితం చేస్తాయి. వాళ్లు ఏం మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? అన్నది కూడా మేమే నిర్ణయిస్తాం.
నేను బీసీసీఐ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్ హోదాలో ‘ముంబై ఇండియన్స్’ను హ్యాండిల్ చేస్తున్నా. మా జట్టు ఆటగాళ్లు ఇంటర్వ్యూలు, షోలు, కామెంటరీ సమయంలో ఏం మాట్లాడాలనేది నేను, నా టీమ్ డిజైన్ చేస్తాం. ఆ ప్రకారంగానే ప్రతీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎలా మాట్లాడితే జట్టుకు హెల్ప్ అవుతుందో వివరిస్తాం. అందుకే ఆటగాళ్లతో సమానంగా మాకూ ప్రాధాన్యం ఉంటుంది. ఇదొక సృజనాత్మక బాధ్యత. అంతే స్థాయిలో రిస్క్ కూడా ఉంటుంది. గతంలో వివిధ చానల్స్‌లో ప్రొడ్యూసర్‌గా చేసినా, ఐపీఎల్ లాంటి మ్యాచ్‌లను హ్యాండిల్ చేయడం కొత్తగా ఉంది. పనిని బాగా ఎంజాయ్ చేస్తున్నా. గోవా, బెంగళూరు, ముంబై.. ఇలా ప్రాజెక్ట్‌ను బట్టి ఎక్కడెక్కడో తిరిగి డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నా. ప్లేయర్స్ మధ్య పనిచేయడం అన్నది చాలామందికి ఓ కల. అలాంటిది ప్లేయర్స్‌నే హ్యాండిల్ చేయడం అంటే కిక్కిచ్చే ఉద్యోగమే కదా!
మా నాన్న రిటైర్డ్ సివిల్ ఇంజినీర్. అమ్మ గృహిణి. మా అమ్మానాన్నలు నేను ఏ అమెరికాలోనో ఉద్యోగం చేస్తూ, అక్కడే స్థిరపడితే బాగుంటుందని అనుకున్నారు. కానీ నేను మాత్రం మీడియా వైపు వచ్చాను. తర్వాత వాళ్లే నన్ను అర్థం చేసుకున్నారు. నేను చదివింది ఎంబీఏ. ఎంచుకున్న రంగం జర్నలిజం. ఇప్పుడున్నది స్పోర్ట్స్‌లో. భవిష్యత్‌లో ఏ రంగంలో ఉంటానో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే ఏదో ఒక ఫీల్డ్‌కు పరిమితం కావడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుంది. బీసీసీఐతో పనిచేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దాన్ని సాకారం చేసుకోగలిగాను. హైదరాబాద్ విద్యానగర్ నుంచి ప్రారంభించిన నా ప్రయాణం బీసీసీఐ దాకా వచ్చిందంటే నాకే ఆశ్చర్యమనిపిస్తుంది. ముందునుంచీ నాకు ఆటలపై పెద్దగా అవగాహన లేదు. అయితేనేం, అవకాశం రాగానే అధ్యయనం చేశాను. తెలియని విషయాలు తెలుసుకున్నాను. ఆ పట్టుదలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.
నాకు ‘ఎన్క్రాఫ్ మీడియా’ అనే సంస్థ ఉన్నది. దీనిద్వారా కమర్షియల్ యాడ్స్ చేస్తుంటాను. హ్యుందయ్, స్టార్ లాంటి పెద్ద క్లయింట్స్ ఉన్నారు. ‘అమ్మాయిలకు ఈ ఫీల్డ్ సూట్ కాదు.. ఆ పని చేయొద్దు’ అని ఒక సర్కిల్ గీస్తారు. అయితే, మనకు తెలియని ఎన్నో రంగాల్లో అపారమైన అవకాశాలు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పనిచేస్తున్నప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. నా విషయానికే వస్తే.. నేనుండేది ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనే అయినా ఎండలో, వానలో తిరగాల్సి వస్తుంది. ఫ్యామిలీని మిస్ అవుతాం. ఏ ఫంక్షన్స్‌కూ వెళ్లలేం. ఎవర్నీ కలిసే అవకాశం ఉండదు. ఈ పరిమితుల్ని ఒక అవకాశంగా భావించాలి, అవరోధమని అనుకోకూడదు. మనం చేసే త్యాగాలే మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి.
..చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం ఇది. చాలా బ్రాడ్కాస్టింగ్స్ నుంచి ప్లేయర్స్ వస్తారు కాబట్టి, ఆటగాడికి సంబంధించిన ప్రతీది పాజిటివ్‌గానే చూపించాల్సి ఉంటుంది. ఈ స్టేజ్‌కి రావడం ఈజీ కాదు. ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో నేను ప్రింట్ మీడియాలో ఉన్నాను. కొంతకాలం ‘స్టార్ స్పోర్ట్స్’ చానల్లో పనిచేశాను. తర్వాత ప్రొడ్యూసర్‌గా మారాను. టీవీ చానల్లో ప్రొడ్యూసర్‌గా చేయడం వేరు. బీసీసీఐ డాక్యుమెంటరీకి ప్రొడ్యూసర్‌గా చేయడం వేరు. ఫ్రీలాన్స్ ప్రొడ్యూసర్‌గా నా విజయమే నన్ను
ఇక్కడిదాకా తీసుకొచ్చింది. తాజాగా ప్రో కబడ్డీకి మేనేజర్‌గానూ వ్యవహరించాను. అంతకుముందు రిలయన్స్ ఫుట్‌బాల్ కప్‌కు ప్రొడ్యూసర్‌గా చేశాను. ఈ జర్నీలో ప్రతి మజిలీనీ ఆస్వాదించాను.
…? దాయి శ్రీశైలం
“Jyoti | ఒకప్పుడు రోడ్లపై భిక్షమెత్తుకుంది.. ఇప్పుడు ఓ కంపెనీకి మేనేజర్ అయ్యింది”
“Kanika Reddy | విమానయాన సంస్థకే సీఈవో అయిన ఈమె ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్”
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”