సిటీబ్యూరో,మే23, (నమస్తే తెలంగాణ) : దేశంలో మళ్లీ కరోనా కలకలం స్పష్టిస్తుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి ‘నమస్తే’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. ఇప్పటికే గాంధీ వైద్యశాలలో 30 పడకలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
జిల్లాలో కరోనా కేసులు వస్తే సత్వర చికిత్సలందించేందుకు ఇప్పటికే వైద్యసిబ్బంది అలర్ట్‌గా ఉన్నారు. గతంలో మొదటి, రెండు వేవ్‌లలో జిల్లాలో 99ప్రైవేట్ ఆసుపత్రుల్లో 11650 పడకలు, ప్రభుత్వాసుపత్రుల్లో 3484 పడకలను సిద్ధం చేసి వైద్యసేవలందించాం. ఇప్పటికూడా పలు ఆసుపత్రుల్లో కొవిడ్ సెంటర్లను కొనసాగిస్తున్నాం. వాటితో పాటు కొవిడ్ నోడల్ సెంటర్ గాంధీలో ఇప్పటికే 30 పడకలను అందుబాటులోకి తెచ్చాం. జిల్లాలో కేసులు పెరిగితే పడకల సమర్థ్యాన్ని పెంచుతాం.
ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణిలు, బాలింతలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఎక్కువ రోజులున్నా కూడా వైద్యులను సంప్రదించండి. కరోనాతో పాటు ఇతర రోగాలు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం నిత్యం పరిశుభ్రత పాటించడం అవసరం.
జిల్లాలోని చెస్ట్ ఆసుపత్రి, కింగ్కోటీలోని జిల్లా ఆసుపత్రి, గాంధీ జనరల్ ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, ఈఎస్ఐసీ ఆసుపత్రి, ప్రభుత్వ మెంటల్ కేర్ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, జంగమ్మెట్, లాలాపేట, సీతాఫల్మండి, శ్రీరాంనగర్ యూసీహెచ్సీలు, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, మలక్‌పేట ఏరియా ఆసుపత్రి, బార్కస్ సీహెచ్‌సీల్లో గతంలో సరిపడా పడకలు సిద్ధం చేసి వైద్యసేవలందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సైతం ఈ తరహాలోనే సిద్ధం చేస్తాం. కేసుల దృష్ట్యా పడకల సామర్థ్యం పెంచుతాం. సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం.