MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ రూరల్, నవంబర్ 1 : మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని రాంపూర్, జూపాక గ్రామాలలో ఆయన శనివారం పర్యటించి వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు కంటతడి పెట్టుకోగా ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం అన్నదాతలను ఆగం చేస్తుంటే కన్నీళ్లు తూడవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు కంటి తుడుపు చర్యగా నష్టపరిహారం ప్రకటించడం పట్ల రైతులపై ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలోనే 30 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ అధికారులు మాత్రం ప్రభుత్వానికి నియోజకవర్గంలో 825 ఎకరాలు మాత్రమే పంట నష్టం జరిగిందని నివేదికలు అందించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
తుఫాను ప్రభావానికి హుజరాబాద్ నియోజకవర్గంలో 30 వేలకు పైగా ఎకరాల్లో వరి పత్తి పంట నష్టం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన పంట నష్టంపై ప్రతీ గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన రైతులందరికీ కష్టపరిహారం అందించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో రైతుల కండ్లలో కన్నీళ్లు తప్ప మిగిలిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేలరాలిన పంటలను చూసి రైతన్నలు విలవిలలాడుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులు కంటి తుడుపు చర్యలుగా నష్టపరిహారం రూ.10వేలు ప్రకటించడం భావ్యం కాదని అన్నారు.
ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు వర్షం కారణంగా ఆరు నెలల కష్టం నేలపాలైందని, ప్రభుత్వం కనీసం మానవత్వంగా అన్నదాతలను తక్షణసాయంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులు నామమాత్రంగా నివేదికలు తయారు చేయకుండా క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగిన ప్రతి గ్రామంలో క్షేత్ర పరిశీలన జరిపి వాస్తవ నివేదికలు ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి నివేదించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ప్రతీ రైతుకు ఇప్పటివరకు బాకీ పడ్డ రైతు భరోసా, బోనస్ లాంటి వాటిని వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతీ కౌలు రైతుకు ఇప్పటివరకు రూ.76 వేలు, రుణమాఫీ రూ.రెండు లక్షలు, సన్న వడ్లకు బోనస్ క్వింటాకు రూ.500 చొప్పున రూ.50 వేల వరకు ప్రతీ రైతుకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించి చిత్తశుద్ధి చాటుకోవాలని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా హుజురాబాద్ లోను రాష్ట్రంలోనూ నిరంతరం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, తిరుమల సురేందర్ రెడ్డి, కొలిపాక శ్రీనివాస్, దయాకర్ రెడ్డి, గంధ శ్రీనివాస్ తో పాటు రైతులు తదితరులు ఉన్నారు.