హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పార్టీ నాయకులు స్వామిగౌడ్, దేవిశ్రీప్రసాద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ మంచి ఫిట్మెంట్లు ఇచ్చారని చెప్పారు.
రెండు పీఆర్సీలు ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామంటే ఉద్యోగులు కాంగ్రెస్‌కు ఓట్లేశారని, రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ రాక నానాయాతన పడుతున్నారని అన్నారు. పదివేల మంది డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే 250 మంది గుండె పగిలి చనిపోయారన్నారు. వారి మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని తేలేదని విమర్శించారు.
ఉద్యోగులు దాచుకున్న డబ్బును ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఇక శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులు అనారోగ్యం పాలైనా చికిత్స చేసుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ డబ్బులు రావడం లేదని చెప్పారు.
కేసీఆర్ దయామయుడిలా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎవరూ చేయలేని పనులు చేశారని అన్నారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరాలంటే జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించాలని చెప్పారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీ దేవీప్రసాద్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. నెలలో మొదటి తారీఖున జీతాలిస్తున్నామన్న పేరుతో ఉద్యోగుల డిమాండ్లు వేటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు రావడం లేదని చెప్పారు. కేసీఆర్ హయాంలో మాత్రం ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు రావడం లేదని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. బీసీ హాస్టల్ ప్రైవేటు బిల్డింగులకు అద్దె చెల్లించడం లేదని ఆరోపించారు. పెన్షనర్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. గతంలో డీఏలు ఎగ్గొట్టిన వారికి ఉద్యోగులు గుణపాఠం చెప్పారు. రేవంత్ రెడ్డికి కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు తొడపాశం పెడితే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. ఉపఎన్నిక ఉందని నిన్న భట్టి విక్రమార్క రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు కొన్ని నిధులు విడుదల చేశారని విమర్శించారు. గతంలో రూ.700 కోట్లు ప్రతి నెలా కేటాయిస్తామని చెప్పి మాట తప్పారని గుర్తుచేశారు. చివరకు రవీంద్ర భారతి కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు పొందిన వారికి కూడా మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పారు.
మాటలు తప్ప చేతలు చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో ఉద్యోగసంఘాల నాయకులు భుజంగ రావు, సుమిత్రానంద్, హమీద్, వేణుగోపాల స్వామి పాల్గొన్నారు. ప్రెస్ మీట్ తర్వాత ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ రూపొందించిన కరపత్రాన్ని నేతలు విడుదల చేశారు.