అమరావతి : శ్రీకాకుళం (Srikakulam) కాశీబుగ్గ (Kasibugga) వేంకటేశ్వర స్వామి ఆలయం (Vekateswara Swamy temple) లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాటలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 8 మంది మహిళలు, ఒక బాలుడున్నారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తుల తాకిడికి రెయిలింగ్ ఊడిపోయి పలువురు కిందపడటంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఘటన విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దురదృష్ట ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘటనపై హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలన్నారు.