గోల్నాక, మార్చి 16: అనుమానం పెనుభూతమైంది. అది మనస్సులో ఉంచుకొని కట్టుకున్న భార్యను పెట్రోలు(Petrol )పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన అంబర్ పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ డి.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట పటేల్ నగర్ బిలాల్ మజీదు బస్తీకి చెందిన నవీన్(32), రేఖ (28) భార్యాభర్తలు. వీరికి ఆరేండ్ల క్రితం వివాహం కాగా, కుమారుడు (5), కుమార్తె (3) ఇద్దరు సంతానం ఉన్నారు. నవీన్ స్థానికంగా స్క్రాప్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంటాడు. కొన్నాళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. గత కొన్ని నెలలుగా భార్యపై అనుమానంతో తరచూ తాగివచ్చి తరచూ కొడుతూ గొడవకు దిగే వాడు.
ఇటీల పెద్దలు సర్దిచెప్పడంతో మళ్లీ కలిసి ఉంటున్నారు. అయినా భార్యపై అనుమానం పెంచుకొన్న నవీన్ తరచూ వేధించసాగాడు. గత సోమవారం రాత్రి ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో కోపోద్రిక్తుడైన నవీన్ తన బైక్‌లో ఉన్న పెట్రోల్ తెచ్చి భార్య రేఖపై పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపిం చడంతో మంటలను ఆర్పివేసి.. బాధితురాలు రేఖ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక దవాఖానకు తరలిస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశాడు. స్థానిక దవఖానాలో చికిత్స పొందుతున్న రేఖ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. బాధితురాలి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులమ భర్త నవీన్ ను అరెస్ట్ చేసి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.