సూర్యాపేట టౌన్, మార్చి 08 : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న జమ్ముల శ్రీనివాస్, జమ్ముల పుష్పలత (43)లకు 25 సంవత్సరాల క్రితం పెండ్లి అయింది. వీరికి ఒక కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కూతురుకు వివాహం కాగా కొడుకు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా జమ్ముల శ్రీనివాస్ తాగుడుకు బానిసై, జల్సాలకు అలవాటు పడి అక్రమ సంబంధాలు కలిగి జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ అప్పుల పాలు చేశాడు.
ఇదే విషయంపై భార్య జమ్ముల పుష్పలత భర్తను ప్రశ్నిస్తూ నిలదీసేందుకు ప్రయత్నించినప్పుడల్లా గొడవపడుతూ ఆమెకు అక్రమ సంబంధాలు అంటగడుతూ అనుమానించేవాడు. అదే అనుమానంతో ఎలాగైనా భార్యను హతమార్చాలనే పథకంతో శనివారం ఉదయం కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. విషయం బయటకు పొక్కకుండా ఇంట్లోనే మృతదేహాన్ని వదిలేసి వెళ్లాడు. ఆదివారం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పుష్పలత సోదరుడు జానకిరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు.
తన తండ్రి శ్రీనివాస్ క్రూరుడు అని ఆయనకు ఉరిశిక్ష వేయాలని కోరుతూ వీరి కుమారుడు ప్రశాంత్ కన్నీటి పర్యంతమయ్యాడు. తండ్రి అక్రమ సంబందాలు పెట్టుకుని జల్సాలకు పాల్పడుతూ తమ కుటుంబాన్ని అసలు పట్టించుకోని దుర్మార్గుడన్నాడు. తమ తల్లిని క్రూరంగా హత్య చేసినట్లు వాపోయాడు. తండ్రి చేసిన అప్పులు తానే తీర్చుతున్నట్లు, అమ్మపై అనుమానంతో హత్య చేశాడని, తన తండ్రికి ఉరిశిక్ష వేయాలని బయటకు రాకూడదని ప్రశాంత్ కోరాడు.