– పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్
బూర్గంపహాడ్, ఏప్రిల్ 16 : మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని, ప్రతి ఒక్కరూ రహదారి నియమ, నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జమలారెడ్డి అధ్యక్షతన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భద్రాచలం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య, తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్‌తో కలిసి డీఎస్పీ మాట్లాడారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్టు ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం వద్దు… పరిమితికి మించి వాహనాలు నడపొద్దని సూచించారు.
వాహనదారుడు ప్రమాదానికి గురైతే తానే కాకుండా కుటుంబాన్ని బాధ పెట్టిన వారవుతారన్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తే మానవ రక్షణ ఉంటుందన్నారు. అదే విధంగా మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు తమతమ శాఖలో జరుగుతున్న పనులు, చేపట్టే పనులను వివరించారు. అనంతరం వివిధ సంఘాల మహిళలు, ప్రజా ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో సర్పంచ్ మందా నాగరాజు, ఎంఈఓ యదు సింహరాజు, ఎస్ఐలు మేడా ప్రసాద్, నాగభిక్షం, మోరంపల్లిబంజర్ పీహెచ్సీ వైద్యులు నగేష్, ట్రాన్స్‌కో ఏఈ ఉపేందర్, ఇరిగేషన్ ఏఈ గణేష్ నాయక్, పీఆర్ ఏఈ చక్రధరా చారి, భజన సతీశ్‌కుమార్, ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, ఐకేపీ, ఆశా, ఏఎన్ఎంలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.