న్యూయార్క్ : శరీరంలో కొవ్వును తగ్గించేందుకు వాడే స్టాటిన్స్ ప్రభావంపై భిన్నాభిప్రాయాలున్నా వీటిని వాడుతున్న వారు కొవిడ్-19 బారినపడితే వ్యాధి తీవ్రతతో మరణించే ముప్పు గణనీయంగా తగ్గింందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మహమ్మారి విరుచుకుపడిన సమయంలో నేషనల్ అమెరికన్ రిజిస్ట్రీ వైద్య రికార్డులను విశ్లేషించిన మీదట శాన్‌డియాగో పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.
ఈ మందును వాడేవారు కరోనా వైరస్ తీవ్రతతో మరణించే ముప్పు 41 శాతం వరకూ తక్కువగా ఉందని అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. గుండె పోటుకు దారితీసే చెడు కొవ్వును (ఎల్డీఎల్) తగ్గించేందుకు స్టాటిన్స్‌ను వాడుతుంటారు. స్టాటిన్స్లో వాపును నివారించే గుణమున్న కారణంగా కరోనాతో వచ్చే వాపు లక్షణాలను అధిగమించడం ద్వారా మరణాల ముప్పు నుంచి కొవిడ్ రోగులు బయటపడే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ అధ్యయనానికి యూసీ శాన్‌డియాగో హెల్త్‌కు చెందిన కార్డియోవాస్క్యులర్ యూనిట్ ప్రొఫెసర్, డైరెక్టర్ లోరి డేనియల్స్ నేతృత్వం వహించారు. ఈ ఏడాది జులై వరకూ దాదాపు 49,000 మందికి పైగా రోగుల రికార్డులను పరిశీలించిన పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు.