Heart Health | కరోనా మనల్ని వదిలిపెట్టడం లేదా? ఆ ప్రభావాలు వెంటాడుతూనే ఉన్నాయా? అందులోనూ, వయోధికులు కొవిడ్ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడి, గుండెపోటుకు దారితీయవచ్చనే ప్రచారంలో నిజమెంత? అసలు కరోనా వైరస్‌కు, గుండెపోటుకు సంబంధం ఏమిటి? కరోనాకు గురైతే గుండెపోటు బారినపడినట్టేనా? .. ఇలాంటి అనేకానేక సందేహాలకు వైద్య నిపుణుడి సమాధానమే ఈ ప్రత్యేక వ్యాసం.
కరోనా.. పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడుతున్నది. ఆ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలితీసుకున్నది. ఎన్నో కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. ఎంతోమందిని అనాథలుగా మార్చింది. వైరస్ దాదాపుగా వదిలిపోయినా ఆ ప్రభావం మాత్రం నీడలా వెంటాడుతూనే ఉంది. పూర్తిగా కోలుకున్నవారు కూడా బ్లాక్ ఫంగస్, మధుమేహం, గుండెపోటు, కిడ్నీ సమస్యలు.. తదితర తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. గుండెపోటుతో హఠాన్మరణాలూ నమోదు అవుతున్నాయి. గుండె సమస్యలకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదు. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టే హృద్రోగ తీవ్రత ఉంటున్నది.
కరోనా వైరస్ ఊపిరితిత్తులతో పాటు రక్తనాళాలపైనా ప్రభావం చూపుతుంది. దీనివల్ల శరీరంలో ఇతర ప్రధాన అవయవాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా వైరస్ శరీరంలో ఏ అవయవాలకు సంబంధించిన రక్తనాళాలపై ప్రభావం చూపుతుందో, ఆ అవయవాలే తీవ్రంగా దెబ్బతింటాయి. మెదడుతో ముడిపడిన రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టిపోయి, అవరోధం ఏర్పడితే బ్రెయిన్‌స్ట్రోక్ రావచ్చు. గుండెకు అనుసంధానమైన రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండెపోటు రావచ్చు. కాళ్లకు సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ అయితే, కాళ్లు చచ్చుబడిపోయి గ్యాంగ్రీన్ వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా కాళ్లలో డీవీటీ (డీప్ వీన్ థ్రాంబోసిస్) వస్తే కాళ్లు వాచి పల్మనరీ ఎంబాలిజానికి దారి తీయవచ్చు. దీనివల్ల రోగి హఠాన్మరణానికి గురికావచ్చు.
కరోనా వైరస్ వల్ల రక్తనాళాల లోపల ఉండే పొర (ఎండోథీలియం) వాపునకు గురవుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, రక్త సరఫరా మందగిస్తుంది. గుండె రక్తనాళాల్లో రక్త సరఫరా మందగించడం లేదా నిలిచి పోవడం వల్ల గుండెకు అవసరమైన ఆక్సిజన్ అందదు. దీంతో గుండెపోటు వస్తుంది. మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో రక్త సరఫరా నిలిచిపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కరోనా ప్రభావంతో సంభవించే హఠాన్మరణానికి ప్రధానంగా మూడు కారణాలు..
1. పల్మనరీ ఎంబాలిజం
2. గుండెపోటు
3. గుండె కండరాలు దెబ్బతినడం (మయోకార్డయిటిస్)
ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తులకు రక్త సరఫరా ఆగిపోతుంది. దీంతో రోగి శ్వాస తీసుకున్నా, రక్తంలో కావాల్సినంత ఆక్సిజన్ అందక రోగి మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వస్తుంది. గుండె కండరాలకు రక్త సరఫరా నిలిచిపోయినా గుండెపోటు రావచ్చు. కొవిడ్‌కు గురైన రోగుల్లో గుండెకు సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ కావడానికి కారణం.. రక్తం గడ్డకట్టడమే. ఇందుకు ప్రధాన హేతువు ఎండోథీలియం దెబ్బతినడం.
రక్తనాళాల లోపల ఉండే పొరను ‘ఎండోథీలియం’ అంటారు. ఇది నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. సాధారణంగా రక్తనాళాల్లో సంకోచ, వ్యాకోచాలు జరుగుతాయి. ఈ ప్రక్రియకు ఎండోథీలియం విడుదల చేసే నైట్రిక్ ఆక్సైడ్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. అంతేకాకుండా, రక్తకణాలు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా ఈ నైట్రిక్ ఆక్సైడ్ దోహదపడుతుంది. దీనివల్ల రక్తనాళాల్లో ప్రవహించే రక్తం సాఫీగా శరీరంలో అన్ని ప్రధాన అవయవాలకూ చేరుతుంది. ఒకరకంగా చెప్పాలంటే, ప్లేట్లెట్స్ ఒకదాని కొకటి అతుక్కోకుండా ఎండోథీలియం పర్యవేక్షిస్తుంది.
కరోనా వైరస్ వల్ల ఎండోథీలియం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ విడుదల ఆగిపోతుంది. దాంతో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఆ దెబ్బకు రక్త సరఫరా మందగిస్తుంది. అంతేకాకుండా రక్తనాళాల్లోని గోడలకు రక్తకణాలు అంటుకుని గట్టిపడతాయి. అలా రక్తకణాలు గట్టిపడిన ప్రదేశంలో రక్తం గడ్డకట్టి రక్తనాళం మూసుకుపోతుంది. ఈ విధంగా గుండెకు సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ అవడంతో గుండెపోటు వస్తుంది.
కరోనా సోకినవారికంతా గుండెపోటు రాదు. చాలా తక్కువమందిలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా తీవ్ర ఇన్ఫెక్షన్కు గురై, ఐసీయూలో వెంటిలేటర్, ఆక్సిజన్‌పై రోజుల తరబడి చికిత్స పొందినవారిలో మాత్రమే రక్తం గడ్డకట్టి, రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడి, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి రోగులు తరచూ డి-డైమర్ మార్కర్స్‌తో పాటు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్‌ను పరీక్షించుకోవాలి. డీ-డైమర్, ఇన్ఫ్లమేటరీ వ్యాల్యూస్ సాధారణంగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తేడా వస్తే మాత్రం వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించి, అవసరమైన చికిత్స తీసుకోవాలి. కరోనా వల్ల ప్రభావితులైనవారే కాదు.. ఒక వయసు తర్వాత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఇవన్నీ.
♦ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
♦ రోజూ వ్యాయామం చేయాలి.
♦ హెచ్‌డీఎల్(ఆరోగ్యకరమైన) కొలెస్ట్రాల్ పురుషుల్లో 40 కంటే ఎక్కువ, మహిళల్లో 50 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
♦ మధుమేహ రోగులు, బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టీ చేయించుకున్నవారు, గతంలో గుండెపోటు వచ్చినవారు.. చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) 70 కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.
♦ అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడం సురక్షితం. ఈ రెండూ హద్దులో ఉంటే 50 శాతం గుండె సమస్యలను నియంత్రించవచ్చు. అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (కాళ్లు చచ్చుబడిపోవడం) బారిన పడకుండా తప్పించుకోవచ్చు కూడా.
– డాక్టర్ శ్రీధర్ కస్తూరి, కార్డియాలజి విభాగ అధిపతి, సన్‌షైన్ హాస్పిటల్, హైదరాబాద్
✍ మహేశ్వర్‌రావు బండారి
Health Tips | తీవ్ర మానసిక అలజడితో గుండె జబ్బుల ముప్పు”
“చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?”
ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!”
గుండె నొప్పి వస్తే తొలి గంటే కీలకం..!”
“ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే మీ గుండెకు డేంజర్ బెల్ మోగినట్టే !!”