కట్టంగూర్, మార్చి 4 : భీకర యుద్ధంతో భీతావాహంగా తయారైన ఉక్రెయిన్ను దాటుకుని ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఎట్టకేలకు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వార్ కారణంగా వారం నుంచి ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఎయిర్‌పోర్ట్‌లో వారిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. బిడ్డలను ప్రేమగా దగ్గరికి తీసుకుని, యోగక్షేమాలు తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చారు. వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లి యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయిన రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన కుడుదుల హరితేజ, కోదాడవాసి తిరిపిశెట్టి గురుచరణ్, నకిరేకల్‌కు చెందిన రాసమల్ల శరత్ శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, అటునుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. కాలినడక, బస్సుల్లో, రైళ్లలో ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో వచ్చినట్లు తెలిపారు. నమస్తే తెలంగాణ బృందం వారిని పలుకరించగా.. బాంబుల మోత మధ్య బంకర్లలో తలదాచుకుంటూ, ఉన్న ఆహారాన్ని దాచుకుని కొద్దికొద్దిగా తింటూ, ఇండియాకు వచ్చే క్రమంలో పడిన ఇబ్బందులను చెప్పుకొచ్చారు.
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన కుడుదుల యాదగిరి,యోగేశ్వరి కుమారుడు హరితేజ ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. అక్కడ రష్యా దాడుల నేపథ్యంలో శుక్రవారం హరితేజ క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో ఆ తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా విద్యార్థిని హరితేజను నమస్తే తెలంగాణ ఫోన్లో పలకరించగా అక్కడి పరిస్థితులను వివరించాడు. ‘నేను చదివే మెడికల్ కళాశాల దాడులు జరిగిన ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాడులు ప్రారంభమైన రోజు నేను ఉండే హాస్టల్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో వరుసగా మూడు మిస్సైల్ పడి పెద్ద శబ్దం రావడంతో భయందోళనకు గురయ్యాను. ప్రాణం అరచేతిలో పెట్టుకొని మూడు రోజులు నిద్రలేకుండా హాస్టల్ బేస్మెంట్ బంకర్లో బిక్కుబిక్కు మంటూ గడిపాను. అనంతరం ఇండియాకు పంపిస్తున్నారని తెలుసుకుని రైల్వేస్టేషన్‌కు వెళ్తే మరో రోజు పంపిస్తామని చెప్పడంతో తిరిగి హాస్టల్‌కు వెళ్లాను. మరో రోజు బస్సులో 900 కిలోమీటర్లు ప్రయాణించి, మరో 8 కిలోమీటర్లు కాలినడకన రొమేనియా దేశ సరిహద్దుకు చేరుకున్నా. అక్కడ తనిఖీ అనంతరం మరో 20కిలోమీటర్లు కాలినడకన వెళ్లి బస్సులో 10గంటలు ప్రయాణం చేశాను. రుమేనియా విమానాశ్రయానికి 20కిలో మీటర్ల దూరంలో అధికారులు వసతి కల్పించారు. అక్కడే మూడ్రోజులు ఉండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాను అని తెలిపారు. కాగా, హరితేజ రాకకోసం శంషాబాద్ విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కొడుకును చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకున్నారు. స్వదేశానికి రప్పించడానికి కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కోదాడటౌన్ : ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న కోదాడ పట్టణానికి చెందిన తిరిపిశెట్టి గురుచరణ్ శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. దాంతో ఆయన తల్లిదండ్రులు వెంకటరమణ-సుధ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. గురుచరణ్ ఉక్రెయిన్‌లో చెర్నివిట్సి సిటీ పరిధిలోని బుకో వినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ 5వ సంవత్సరం చదువుతున్నాడు. కోదాడకు చేరుకున్న తాను విలేకరులతో మాట్లాడాడు. నేను చదువుతున్న యూనివర్సిటీకి రొమేనియా దేశ సరిహద్దు 30కి.మీ దూరం ఉండడంతో తనతో పాటు చదువుతున్న 250మంది విద్యార్థులను బుకరెస్ట్ సిటీకి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు ఉంచారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో ఈ నెల 3న ఉదయం 11.30 గంటలకు ఇండియాకు చేరుకున్నాం. ఢిల్లీ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తెలుగు రాష్ర్టాలకు చెందిన 9 మంది శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నాం. కేంద్ర, రా్రష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఉక్రెయిన్‌లో ఉన్న మన విద్యార్థులను దేశానికి తీసుకురావాలి అని తెలిపారు. ఈ సందర్భంగా కనగాల వెంకటరామయ్య, నూనె సులోచన, ఈవీఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎస్ఎస్.రావు, పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.
కట్టంగూర్(నకిరేకల్): నకిరేకల్‌కు చెందిన రాసమల్ల సైదులు, లక్ష్మి కుమారుడు శరత్ ఉక్రెయిన్‌లోని కీవ్‌లో గల మా యూనివర్సిటీలో మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే కీవ్‌లో యద్ధానికి కొద్ది గంటలు సడలించడంతో అతడు క్షేమంగా వచ్చాడు. ఈ సందర్భంగా శరత్ విలేకరులతో మాట్లాడాడు. యుద్ధ సమయంలో క్షణ క్షణం భయంగా గడిపాం. వసతి గృహం వద్ద ఓ బంకర్లో తలదాచుకున్నాం. కనీసం తినాలన్నా ఏం దొరకలేదు. మా వద్ద ఉన్న బిస్కెట్స్, స్నాక్స్ కొంచెం కొంచెం తింటూ గడిపాం. బాంబుల మోత, ఫిరంగుల శబ్దం వినిపించడంతో భయమేసింది. మాటల్లో చెప్పలేని బాధ కనిపించింది. అమ్మానాన్నలతో మాట్లాడితే ధైర్యం వచ్చినా లోపల మాత్రం భయంగా ఉండేది. మేము ఉన్న దగ్గరి నుంచి కొంత దూరం పరిగెత్తికెళ్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లాం. అక్కడి నుంచి మూడు రైళ్లల్లో ప్రయాణం చేసి హంగేరి చేరుకున్నాం. అక్కడే ఎంబసీ అధికారులు హోటల్లో ఉంచి మరుసటి రోజు ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టారు. అటు నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నాం. క్షేమంగా హైదరాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టడంతో ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. క్షేమంగా ఇంటికి రావడానికి ప్రయత్నించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, తమ తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
ఉక్రెయిన్ నుంచి క్షేమంగా నకిరేకల్‌కు వచ్చిన వైద్య విద్యార్థి శరత్‌ను మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం పరామర్శించారు. అక్కడ జరిగి విషయాలను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం శాలువాతో సన్మానించి కేక్ తినిపించారు.