కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోళ్లు చేపట్టదు. ఇదేమని బీజేపీ నేతలూ అడగరు. కాంగ్రెస్ ప్రభుత్వమో, ఆ పార్టీ నేతలో పట్టించుకుంటున్నరా.. అంటే అదీ లేదు. రెండు జాతీయ పార్టీల రాజకీయ పాచికలాటలో పత్తిరైతు నలిగిపోతున్నడు. దగా పడుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఇంటిని ముట్టడించింది. నిరసనపై పోలీసులు విరుచుకుపడ్డారు. జోగు రామన్న సహా పలువురు నేతలను అరెస్టు చేశారు.
ఆదిలాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోళ్లలో రోజుకో తీరుగా వ్యవహరిస్తుండటంతో బుధవారం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు నగేశ్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆందోళన చేపట్టారు. సీసీఐ, ఎంపీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎకరాకు ఏడు క్వింటాళ్లు కాకుండా 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకుల రాక విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఎంపీ ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. జోగు రామన్నతోపాటు నాయకులు, కార్యకర్తలు రెండు వైపుల నుంచి దూసుకొచ్చి బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. తేమ 12 నుంచి 25 శాతం ఉన్నా సీసీఐ కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, లేదంటే తక్షణమే రాజీనామా చేయాలని నగేశ్‌ను ఉద్దేశిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఆందోళన ఉద్రిక్తం
ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించిన మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ తోపులాటలో బీఆర్ఎస్ నాయకుడు విజ్జిగిరి నారాయణ కాలికి గాయమై రక్త స్రావమైంది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను పక్కకు నెట్టి రామన్నను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు నిలువరించారు. పోలీసులు వాహనంలో తీసుకెళ్తుండగా కార్యకర్తలు అడ్డుకోగా పక్కకు తొలగించారు. అనంతరం రామన్నను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. రామన్నను విడుదల చేయాలంటూ ఠాణా ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఇంటి ఎదుట ఆందోళన చేసిన మాజీమంత్రి జోగు రామన్నతోపాటు మరో 40 మంది నాయకులు, కార్యకర్తలపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అరెస్ట్ అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ రైతులకు అన్యాయం చేస్తున్నది. బీజేపీ ఎంపీ నగేశ్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ఎందుకు పట్టించుకోవడం లేదు. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉంది. కేంద్ర మంత్రులతో మాట్లాడి సీసీఐ కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూసే అవకాశాలున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు మార్కెట్‌ను సందర్శించి కొనుగోళ్లను పరిశీలించిన దాఖలాలు లేవు. రైతులకు అండగా ఉండాల్సిన సీసీఐ కార్పొరేట్ వ్యాపారం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నది. మద్దతు ధర రూ. 8,110తో సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు రూ.6,200లకు విక్రయించి నష్టపోతున్నారు. సీసీఐ 18 శాతం తేమ ఉన్నా కొనుగోళ్లు చేపట్టాలి. ఎకరాకు ఏడు క్వింటాళ్లు కాకుండా 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పత్తికి కేంద్రం 11 శాతం సుంకం ఎత్తి వేయడంతో రైతులు నష్టపోతున్నారు. సీసీఐ షరతులు లేకుండా మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేసే వరకు ఆందోళనలు చేస్తాం.
-జోగు రామన్న, మాజీమంత్రి
ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు
సీసీఐ పత్తిని సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. సీసీఐ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేస్తే సర్కారు అడ్డుకుంటున్నది. బుధవారం ఎంపీ నగేశ్ ఇంటి ఎదుట ఆందోళన చేపడితే అక్కడ జరిగిన తోపులాటలో నా కాలి వేళ్లకు గాయాలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులు సమస్యలను పట్టించుకోకపోవడంతోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాం. రెండు ప్రభుత్వాలు స్పందించి రైతులు నష్టపోకుండా చూడాలి. రైతులకు మద్దతు ధర లభించేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తాం.
-విజ్జిగిరి నారాయణబీఆర్ఎస్ నాయకుడు, ఆదిలాబాద్
రైతుల గోడు వినేటోళ్లు లేరు
పంట కొనుగోళ్లలో సీసీఐ అన్యాయం చేస్తున్నది. దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో రైతులు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన పత్తిని తేమ ఎక్కువ ఉందని కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి క్వింటాలుకు రూ. 1,500 చొప్పున నష్టపోతున్నారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులకు జరుగుతున్న నష్టంపై సీసీఐ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలి. అలాకాకుండా తమకు ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రైతుల సమస్యలపై బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు.
-సెవ్వ జగదీశ్, ఆదిలాబాద్