Municipal Elections | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పురపాలక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని ఆదేశించింది. కాలపరిమితి పూర్తయినప్పటికీ ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ అంశం పై సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయి దా వేసింది. ఈ ఏడాది మార్చి 25న నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాలపరిమితి ముగిసింది. అయినప్పటికీ అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదని నిర్మల్ నటరాజ్‌నగర్‌కు చెందిన వ్యవసాయదారుడు సముందర్‌పెల్లి రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ..
ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాలు లేకపోతే అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుందని అన్నారు. రాజ్యాంగంలోని 243యూ, 243జడ్‌ఏ అధికరణాల ఉల్లంఘన జరుగుతుందని చెప్పారు. తెలంగాణ మునిసిపాల్ యాక్ట్ 2019లోని నిబంధనలను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్రంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. వార్డుల విభజన, రిజర్వేషన్ల వర్గీకరణ వంటివి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయాలని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించగలమని చెప్పారు. రాష్ట్రం నుంచి పూర్తి వివరాలతోపాటు ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేశాకే ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుంటూ ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకుని చెప్పేందుకు రెండు వారాల గడువు కావాలని కోరడంతో అందుకు హైకోర్టు అనుమతిచ్చింది.