హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్డుల పునర్విభజనకు జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పాక్షికంగా సవరించింది. వార్డుల జనాభా వివరాలు, వార్డుల ఏర్పాటుకు ప్రామాణికంగా తీసుకున్న మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులను పిటిషనర్ల వరకే పరిమితం చేసింది. హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరు కక్షిదారులకు సంబంధించిన రెండు వార్డులు (104, 134), మ్యాప్ ల వివరాలను అధికారి వెబ్సైట్లో పొందుపర్చాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
ఈ నెల 20వ తేదీ శనివారం ఉదయం పది గంటలకు వాటిని ఈ ఇద్దరు పిటిషనర్లకు అందజేయాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ ను ఆదేశించింది. ఆ తర్వాత 48 గంటల వరకు ఈ ఇద్దరు పిటిషనర్లు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు గడువు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ ఎంసీ కమిషనర్ సవాల్ చేస్తూ అత్యవసర లంచ్ మోషన్ రూపంలో అప్పీల్ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిని ద్విసభ్య ధర్మాసనం విచారణ పూర్తి చేస్తూ, ప్రధాన పిటిషన్లల్లోని అంశాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై సింగిల్ జడ్జి విచారణ పూర్తి చేసి తుది ఉత్తర్వులను జారీ చేయాలని ఆదేశించింది. ఈ నెల 17న సింగిల్ జడ్జి 300 డివిజన్ల వివరాలు, జనాభా గణాంకాలు, మ్యాప్‌లను పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేయాలంటూ వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదించారు. ఈ ఏడాది 12న వెలువడిన ప్రొసీడింగ్స్ ప్రకారం వార్డుల విభజనపై సింగిల్ జడ్జి ఆదేశాలు ఏకపక్షమన్నారు. వార్డుల వారీగా జనాభా వివరాలు, వార్డుల ఏర్పాటుకు ప్రామాణికంగా తీసుకున్న భౌగోళిక మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని అధికారులను ఆదేశించడం చెల్లదన్నారు. డీలిమిటేషన్ నోటిఫికేషన్ చట్ట నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ఏకపక్షం గా, రాజ్యాంగ విరుద్ధంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఉన్నాయన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ (వార్డుల డీలిమిటేషన్)-1996 నిబంధనలకు, జీహెచ్ఎంసీ చట్ట నిబంధనలకు కూడా వ్యతిరేకమన్నారు. వార్డుల డీలిమిటేషన్‌తో సహా ఎన్నికల విషయాలలో న్యాయపరమైన జోక్యాన్ని ఆసారం తకువని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని అధికరణం 243 (జెడ్ జీ) ప్రకారం కోర్టుల జోక్యానికి పరిమితులున్నాయని చెప్పారు. సింగిల్ జడ్జి ఆ అధికరణాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. డీలిమిటేషన్ కసరత్తు చట్టబద్ధంగా జరుగుతుందన్నారు. అవగాహనను నమో దు చేసుకున్నప్పటికీ, నిర్వహణ సమస్యను నిర్ణయించకుండా మధ్యంతర ఆదేశాలను జారీ చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను పాక్షికంగా సవరించింది. మొత్తం 300 వార్డులకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలనే ఉత్తర్వులను పకన పెట్టింది. హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరు పిటిషనర్లకు సంబంధించిన 104, 134 వార్డుల వివరాలు, జనాభా, మ్యాప్‌లను పబ్లిక్ డొమైన్ ద్వారా బహిరంగపర్చాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ కు ఆదేశాలను జారీ చేసింది.