హైదరాబాద్ : ఆన్లైన్ ఎగ్జామ్‌లో హైటెక్ పద్ధతిలో కాపీయింగ్‌కు పాల్పడుతూ ఓ యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. ఎలక్ట్రానిక్ డివైజ్లతో పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తూ సిబ్బందికి చిక్కి చివరకు కటకటలా పాలయ్యాడు.. వివరాల్లోకి వెళితే.. వాయుసేన ఎయిర్‌మెన్ ఆన్లైన్ పరీక్ష సరూర్‌నగర్‌లోని కర్మన్‌ఘాట్ ఎస్ఈజెడ్ పరీక్షా కేంద్రంలో జరిగింది. ఈ పరీక్షకు హర్యానాకు చెందిన సౌరభ్ అనే యువకుడు హాజరయ్యాడు. ఎవరికీ కనిపించకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చుకొని ఎగ్జామ్ హాల్‌కి వచ్చి, వాటి సహాయంతో పరీక్ష రాసేందుకు ప్రయత్నించాడు.
సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్న సిబ్బందికి.. యువకుడి తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఇన్విజిలేటర్లు అతన్ని తనిఖీ చేశారు. చెవికి రిసీవర్, బనియన్‌కు ఎలక్ట్రానిక్ డివైస్ అమర్చుకొని కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. హర్యానాలో ఉన్న మిత్రుల సహకారంతో సౌరభ్ పరీక్ష రాస్తున్నట్లు తేలింది. దీంతో సిబ్బంది సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.