సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణాన్ని వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో పట్టణంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. సిరిసల్లలోని వెంకంపేట, పాతబస్టాండ్, గాంధీ చౌక్, కరీంనగర్ రోడ్డు, సంజీవయ్య నగర్, ప్రగతి నగర్, చంద్రంపేట, పోస్టాఫీస్ ప్రాంతం పూర్తిగా నీటమునిగాయి.
దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. కాగా, నీటమునిగి ప్రాంతాల్లో స్థానిక టీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజలను కలెక్టర్ అనురాగ్ జయంతి అప్రమత్తం చేశారు. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని, అందువల్ల ప్రజలు అత్యవసమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. పిల్లలు వాగులు, వంకలు, నీటి ప్రవాహాలు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని కోరారు.
జిల్లా లోని పలు కాజ్వేలు, లో లెవెల్ వంతెనలపై వర్షపునీరు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న దృష్ట్యా వాటిని దాటొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు తడిసిపోయి షాక్ వచ్చే అవకాశం ఉన్నందున వాటిని తాకవద్దని, దూరంగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం నంబర్ 93986 84240ను సంప్రదించవచ్చని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో షాజుల్నగర్లో ఎల్లమ్మగుడి కాలువ పొంగి పొర్లుతున్నది. ఈ క్రమంలో జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ కారు కాలువ ప్రవాహంలో కొట్టుకుపోయింది. గుర్తించిన స్థానికులు కారులో చిక్కుకున్న ఇద్దరిని రక్షించారు. మరో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను గంగ (40), కిట్టు (4)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.