నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 29 : ఉమ్మడి జిల్లాలో బుధవారం వర్షం దంచికొట్టింది. ములుగు, భూపాలపల్లిలో భారీ వర్షం కురవగా, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్‌లో మోస్తరు వాన పడింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఓసీ-2, ఓసీ-3 ప్రాజెక్టుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. సుమారు 10 వేల టనుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు, రూ.4కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మహదేవపూర్ మండలంలోని చండ్రుపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ రోడ్డు గుండా ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.

పెద్దంపేట, కుదురుపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశవపూర్ మధ్యలో ఉన్న పెద్దవాగు లోలెవల్ వంతెనపై నుంచి వస్తున్న వరదకు కాటారం-మేడారం ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాటారం మండల కేంద్రంలో ఇంటి గోడ కూలగా, చిదినేపల్లి గ్రామంలో ఇంటిపై భారీ చెట్టు పడి నష్టం వాటిల్లింది. టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి, కిష్టంపేట గ్రామాల మధ్య వేసిన తాతాలిక రోడ్డు తెగిపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దొడ్ల, ఎలిశెట్టి పల్లి వాగులో ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలు స్తంభించాయి.

మంగపేట మండలం నర్సింహసాగర్ పంచాయతీ పరిధి శనగకుంట కూడలి ఒర్రె వద్ద నిర్మిస్తున్న వంతెన పక్కన డైవర్షన్ రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. మల్లూరు, రమణక్కపేట గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. తాడ్వాయి మండలం మేడారంలోని అమ్మవార్ల గద్దెల నుంచి జంపన్నవాగు వెళ్లే దారి జలమయమైంది. కన్నాయిగూడెం మండలంలో కంతనపల్లి చెరువు సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రధాన రోడ్డులో ఉన్న లోలెవల్ వంతెనపైకి రావడంతో మండలానికి రాకపోకలకు నిలిచిపోయా యి. సర్వాయి, ఐలాపురం గ్రామాల సమీపంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ముప్పనపల్లి గ్రామంలో పలువురి ఇండ్లలోకి నీరు చేరడంతో పునరావాస కేంద్రానికి తరలించారు. ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, లక్ష్మీపురం, తుపాకులగూడెం, కన్నాయిగూడెంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాజేడు మండలంలోని చీకుపల్లి, పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్యలోని 163 జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఇసుకవాగు బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా రెండోసారి నిర్మించిన డైవర్షన్ రోడ్డు వరద ఉధృతికి మరోసారి కొట్టుకపోయింది. దీంతో మండలంలోని 26 గ్రామాలతోపాటు ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల మో స్తరు వాన పడగా, మరికొన్ని చోట్ల ముసురు కమ్మింది.