హనుమకొండ, జూలై 29 : ‘వైద్యాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. ప్రతి పీహెచ్సీలో వంద శాతం ఆధార్ హాజరుండాలి. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. మెడికల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాటిని వేగవంతం చేయాలి. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి’ అని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. మంగళవారం ‘పల్లెల్లో అరకొర వైద్యం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ బుధవారం ప్రాథమిక, ఉన్నత ఆరోగ్య కేంద్రాలు, ఆర్బీఎస్కే, పల్లె దవాఖాన వైద్యాధికారులతో మాతా శిశు ఆరోగ్య సేవలు, టీబీ ముక్త్ భారత్, సార్వత్రిక టీకాలు, అసంక్రమిత, సీజనల్ తదితర వ్యాధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెసీల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని, నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. అన్ని కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్ట్‌లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ మదన్మోహన్ రావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకృష్ణారావు, ఎల్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మురళి, డాక్టర్ జ్ఞానేశ్వర్, డెమో అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.