Rain : ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ఎండలు దంచికొడుతుంటే, మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది.
ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాగల రెండు రోజులపాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పారు. ఆదివారం పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వివిధ జిల్లాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.