కమ్మర్పల్లి: ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు అధికారులు 24 గేట్లను ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో క్రమంగా పెరగడంతో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మంగళవారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రానికల్లా 86 వేల 530 క్యూసెక్కులకు చేరింది. దీంతో అధికారులు క్రమంగా 24 గేట్లను ఎత్తి దిగువకు 99 వేల 880 క్యూసెక్కులు వదులుతున్నారు.
ఎగువన మహారాష్ట్రతో పాటు ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతుందని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90.313 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉంది. గత సంవత్సరం ఇదే రోజున ప్రాజెక్టులో 1089 అడుగుల నీటి మట్టం, 82.734 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రాజెక్టులోకి 150.633 టీఎంసీల ఇన్‌ఫ్లో, 78.757 టీఎంసీల ఔట్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జెన్కోకు 7500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 50 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 51 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.