హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు భానుడు భగభగమంటున్నాడు. దీంతో పెరిగిన ఎండవేడితోపాటు ఉకపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణలో భానుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చనున్నట్టు హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్జ్, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. ముఖ్యంగా ఈనెల 16,17,18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు తీవ్రస్థాయిలో వీచే అవకాశాలు ఉన్నాయని వివరించింది. గురువారం ఆదిలాబాద్ జిల్లాల్లో 44.7 డిగ్రీలు, జగిత్యాలలో 44.6, నిర్మల్లో 44.6, పెద్దపల్లిలో 44.6, నిజామాబాద్లో 44.5, కామారెడ్డిలో 44.2, సిద్దిపేటలో 44.2 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో 42 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. పెరిగిన ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.