న్యూఢిల్లీ : ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వినియోగించి సంక్షేమ పథకాల్లో కోత విధించడానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు నిర్ణయించాయి. అందుకే ఓటరు జాబితలో మరణించిన, అనర్హుల, డూప్లికేట్ పౌరులను తొలగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సర్ ప్రక్రియను ఎన్నికల తర్వాత కూడా విస్తరిస్తున్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు వీటిని వినియోగించనున్నారు.
తొలిసారిగా బెంగాల్లో అధికారం చేపట్టిన సువేందు నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిని ప్రభుత్వం పథకాలకు అనర్హులను చేయాలన్న సంకేతాన్ని ఇచ్చింది. బీహార్లో కూడా ఇదే తరహా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే సర్లో తొలగించిన వారి పేర్లను రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం ప్రారంభించింది. సర్ కింద తొలగించిన జాబితాలోని వారు రేషన్, సంక్షేమ పథకాలతో పాటు ఏ ప్రభుత్వ పథకాలకు కూడా అర్హులు కాబోరని బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధురీ వెల్లడించారు.