వాషింగ్టన్ : అమెరికా కేంద్రంగా పని చేస్తున్న దిగ్గజ సాంకేతిక సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ వినియోగం, దానిపై భారీగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని (4 వేల లోపు) తొలగించనున్నట్టు సిస్కో సీఈవో చక్ రాబిన్స్ తెలిపారు. వేగంగా పెరుగుతున్న ఏఐ మార్కెట్లో పోటీ పడేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించడం లేదా ఉద్యోగ స్థానం మార్చడం చేస్తామని ప్రకటించింది. రిటైల్ మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి, ఏఐ వినియోగాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకొన్నామని కంపెనీ సీఈవో జాన్ ఫర్నర్ తెలిపారు.
ప్రముఖ ఉద్యోగాన్వేషణ ప్లాట్‌ఫామ్ లింక్డ్ ఇన్ కూడా తమ సిబ్బందిలో 5 శాతం (875) మందిని తొలగించనున్నట్టు పేర్కొన్నది. ప్రస్తుతం ఆ కంపెనీలో 17,500 మంది పూర్తి కాల ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు తమ అమ్మక భాగస్వామ్య సేవల విభాగంలో కొద్ది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు అమెజాన్ తెలిపింది. వీరంతా మూడో పార్టీ అమ్మకందారులతో కలిసి పని చేస్తారని తెలిపింది. ఇంకోవైపు గిట్‌ల్యాబ్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్దిష్టమైన మార్కెట్లలో 30 శాతం సిబ్బందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. ఆ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 2,580 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదే సమయంలో భారత్‌లో కొత్తగా 20 మంది ఉద్యోగులను నియమించకోనున్నట్టు ఆ సంస్థ తెలిపింది.
ఇప్పటికే 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్ భారత్‌లోని ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు జారీ చేసిన జాబ్ ఆఫర్ లెటర్లను రద్దు చేసింది. ఎన్ఐటీ-వరంగల్ విద్యార్థి ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఒక లెటర్‌ను బిజినెస్ టుడే ప్రచురించింది. కంపెనీ పునర్వ్యస్థీకరణలో భాగంగా అభ్యర్థుల్లో ఎలాంటి లోపం లేకపోయినా వారి ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకొన్నట్టు ఒరాకిల్ తెలిపింది.