న్యూఢిల్లీ: ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ల ఎగుమతిపై ఎటువంటిటి నిషేధమూ విధించలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం ఈ సంగతి చెప్పారు. ఇప్పటివరకు 80కి పైగా దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేశామని తెలిపారు.
దేశీయ అవసరాలకు అనుగుణంగా కరోనా వ్యాక్సిన్ల డిమాండ్‌ను తీర్చేందుకు కెనడాకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వ్యాక్సిన్ ఎగుమతిని నిరవధికంగా నిలిపివేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
‘దేశీయంగా దశలవారీగా టీకా అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. భవిష్యత్‌లో భారత్ తన భాగస్వామ్య దేశాలకు టీకా సరఫరాను కొనసాగిస్తుంది. ఈ నిర్ణయంతో ఎలాంటి మార్పులేదు’ అని అప్పుడే ఆ వార్తలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. తాజాగా మరోసారి విదేశాంగశాఖ వ్యాక్సిన్ల ఎగుమతిపై స్పష్టతనిచ్చింది.
జనవరి 20 నుంచి భారత్ విదేశాలకు టీకాలను ఎగుమతి చేస్తున్నది. ఇప్పటివరకు 84 దేశాలకు 64 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి