Harish Rao | చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిన మహానీయుడు అంబేద్కర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఆయన చదువుకున్నారని.. తాను సంపాదించిన జ్ఞానాన్ని దేశ ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఉపయోగించారని తెలిపారు. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కొల్లూరులో నిర్వహించిన అంబేడ్కర్ 135వ జయంతి వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళలకు కార్మికులకు దళిత గిరిజనులకు అన్ని వర్గాల్లో వెలుగు నింపాడని తెలిపారు. అందరం సమాన హక్కులు పొందుతున్నామంటే దానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని పేర్కొన్నారు. చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి అనే మంత్రాన్ని చెప్పాడని అన్నారు. దాన్ని ముందుకు తీసుకు పోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. చదువు లేకుంటే జీవితం లేదని అన్నారు. వివక్ష పై పోరాటం చేయాలని అంబేద్కర్ చెప్పారని అన్నారు.
అంబేద్కర్ జయంతి అంటే పూల మాలలు వేయడం కాదు, వారి ఆశయాలను కొనసాగించాలని హరీశ్‌రావు సూచించారు. అంబేద్కర్ సిద్ధాంతాలు పాటించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ రాజ్యాంగమే దారి చూపిందని తెలిపారు. మెజార్టీ అనే పదాన్ని తొలగించి ఆర్టికల్ 3 ని రూపొందించారని.. లేదంటే మేము 119 మంది, ఏపీ ఎమ్మెల్యేలు 175 ఉన్నందుకు తెలంగాణ ఎప్పటికీ రాకపోవునని చెప్పారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ముందు చూపుతో ఆలోచించి రాశారని.. అందువల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అంబేద్కర్ అందరి వాడు కానీ తెలంగాణకు మరింత దగ్గరి వాదని చెప్పారు. అందుకే సచివాలయానికి అంబేద్కర్ సచివాలయంగా కేసీఆర్ పేరు పెట్టారని గుర్తుచేశారు. దేశంలో ఏ సచివాలయం కూడా అంబేద్కర్ పేరు లేదని, మన తెలంగాణలో మాత్రమే ఉందని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు.