Harish Rao | సింగరేణి ఓవర్ బర్డెన్ (ఓబీ) టెండర్లలో రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న దోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ముసుగులో కాంట్రాక్టర్ల రింగ్ ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రజల ఆస్తిని ఎలా లూటీ చేస్తుందో బీఆర్ఎస్ బయటపెట్టిందని అన్నారు. బీఆర్ఎస్ అడుగడుగునా నిలదీయడంతోనే శ్రీరాంపూర్SRP OC-II టెండర్ ఫైనాన్షియల్ బిడ్ల అసలు బాగోతం బయటపడిందని అన్నారు.
టెక్నికల్ బిడ్ అయిన తర్వాత కూడా ఫైనాన్షియల్ బిడ్ ను దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏడుసార్లు ఎందుకు వాయిదా వేశారని నిలదీసి సింగరేణి కార్మిక లోకాన్ని బీఆర్ఎస్ పార్టీ చైతన్యపరిచిందని హరీశ్‌రావు తెలిపారు. ఆ నిరంతర ఒత్తిడికి తలొగ్గి, ఎట్టకేలకు సిండికేట్ ప్రమేయం లేకుండా పారదర్శకంగా బిడ్లు తెరిచేసరికి.. ఈ టెండర్ ఏకంగా మైనస్ 12 శాతం (–12%) కు క్లోజ్ అయిందని పేర్కొన్నారు. కొత్త నిబంధనలు తెచ్చాక సింగరేణిలో నమోదైన తొలి నెగెటివ్ బిడ్ ఇదే అని చెప్పారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి సిండికేట్ ను బద్దలు కొడితే అసలైన పోటీ ఎలా ఉంటుందో, ధరలు ఎలా దిగి వస్తాయో ఈ ఒక్క టెండర్ నిరూపించిందని అన్నారు. గతంలో సింగరేణిలో ఓబీ టెండర్లు పారదర్శకంగా ఆన్లైన్లో జరిగేవని గుర్తుచేశారు. అప్పట్లో –7% నుంచి –20% తక్కువకే పనులు పూర్తయ్యి, సంస్థకు వందలాది కోట్లు ఆదా అయ్యేవని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో ఈ దోపిడీకి స్కెచ్ గీశారని విమర్శించారు.
ఆన్లైన్ టెండర్ల పారదర్శకతను దెబ్బతీయడానికే కావాలని ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన తెచ్చారని హరీశ్‌రావు తెలిపారు. టెండర్ వేయకముందే అధికారుల దగ్గర ఈ సర్టిఫికెట్ తీసుకోవాలనే నిబంధన పెట్టడం వెనుక ఉన్న కుట్ర ఏంటంటే.. ఎవరెవరు టెండర్ వేస్తున్నారో అధికార పార్టీ నేతలకు ముందుగానే తెలిసిపోతుందని తెలిపారు. వాళ్లను బెదిరించి, పోటీ లేకుండా చేసి, తమకు కావాల్సిన వారికే టెండర్లు దక్కేలా సిండికేట్ ఏర్పాటు చేయడానికి ఇది బ్రహ్మాస్త్రంగా మారిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సిండికేట్ పుణ్యమా అని తక్కువకు పోవాల్సిన టెండర్లన్నీ +7% నుంచి +10% ఎక్కువకు ఖరారవుతూ సింగరేణి ఖజానాకు భారీ గండి కొట్టాయని మండిపడ్డారు. ఈ –12% బిడ్ చూశాక.. గతంలో +10% అదనంగా కోట్ చేస్తూ దక్కించుకున్న టెండర్లలో కమిషన్ల కోసం ఎంత దారుణమైన కుమ్మక్కు జరిగిందో స్పష్టమవుతున్నదని అన్నారు. ఈ సిండికేట్ దందా కేవలం టెండర్లకే పరిమితం కాలేదు, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను, సామాన్యుడి జేబును కూడా గుల్ల చేస్తోందని పేర్కొన్నారు. ఈ కమీషన్ల కక్కుర్తి వల్ల ఓబీ పనుల్లో తీవ్ర జాప్యం జరిగి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పడిపోయిందని హరీశ్‌రావు తెలిపారు. బొగ్గు లేక జెన్కో విద్యుత్ ఉత్పత్తి తగ్గించి, అనివార్యంగా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటు కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి తగ్గి సింగరేణికి ఆదాయం గండి.. ఎక్కువ రేటుకు కరెంటు కొని జెన్కోకు నష్టం.. అంతిమంగా ఈ భారం అంతా విద్యుత్ చార్జీల రూపంలో సామాన్య ప్రజల నెత్తిన పడుతోందని తెలిపారు.
మరోవైపు బొగ్గు ఉత్పత్తి తగ్గి, సంస్థ లాభాలు పడిపోతుండటంతో.. బొగ్గు గని కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తూ ప్రతి ఏటా ఎంతో ఆశగా ఎదురుచూసే దసరా బోనస్ లాభాల వాటా శాతానికి కోత పడే ప్రమాదం ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల వాటాల కోసం, ముఖ్యమంత్రి బంధువుల కమిషన్ల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ సంపదను కాపాడే విధంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి టెండర్లలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. అవినీతికి ఆస్కారం ఇస్తున్న సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన కాంట్రాక్టర్ల సిండికేట్ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థను రాజకీయ కమీషన్లకు అడ్డాగా మారిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శ్రీరాంపూర్ టెండర్లలో వచ్చిన –12% బిడ్ కాంగ్రెస్ అసలు రంగును బయటపెట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సిండికేట్ బద్దలైతే ప్రజాధనం ఎలా ఆదా అవుతుందో ఈ పరిణామంతో రుజువైందని అన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పోరాట విజయమని స్పష్టం చేశారు. తెలంగాణ వనరులను కాపాడేది ఎవరో, కాంట్రాక్టర్ల కమీషన్లను కాపాడేది ఎవరో ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమైందని అన్నారు.

Singareni Tenders