వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. కొంతమందిలో అసలు జుట్టే పెరగట్లేదన్న ఆరోపణ ఉంటుంది. కానీ ఈ సమస్యలు వచ్చినప్పుడు అందరూ రకరకాల షాంపూలు, నూనెలు, సీరమ్‌లు అంటూ ప్రయోగాలు చేస్తారు తప్ప సమస్యకు మూలం కనుక్కోరు. నిజానికి జుట్టు ఆరోగ్యానికి శరీరంలోని మెగ్నీషియం స్థాయులకు దగ్గరి సంబంధం ఉంది. శరీరంలో మెగ్నీషియం లోపించినప్పుడే ఈ సమస్యలు వస్తాయి. ఇదే విషయాన్ని పరిశోధకులు ఎన్నో అధ్యయనాల్లో తేల్చారు కూడా. రోజువారీగా తీసుకునే ఆహారంలో శరీరానికి సరిపడా మెగ్నీషియం అందేలా చూసుకోవాలి.
అలాగే వైద్యులను సంప్రదించి మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవచ్చు. మాడుకు రక్త ప్రసరణ బాగా జరగడంలో, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో, క్యాల్షియం స్థాయులను క్రమబద్ధీకరించడంలో మెగ్నీషియం తోడ్పడుతుంది. తద్వారా జుట్టుకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టును సమస్యలు చుట్టుముడుతాయి. శరీరంలో సరైన మోతాదులో మెగ్నీషియం లేకపోతే, క్యాల్షియం ఎక్కువై కుదుళ్లు మూసుకుపోతాయి. దానివల్ల హెయిర్ సైకిల్ దెబ్బతింటుంది. అలాగే మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణం తగ్గి మాడుపై పుండ్లు, దురద లాంటి సమస్యలు వస్తాయి. శరీరానికి తగినంత మోతాదులో మెగ్నీషియం అందాలంటే ఈ కింద పేర్కొన్న ఆహార పదార్థాలకు మీ డైట్లో చోటివ్వండి.