Raisins Milk | మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. కనుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. పాలను తాగడం ఎంతో పురాతన కాలం నుంచి వస్తున్న ఆహారపు అలవాటు. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుకనే చిన్నా, పెద్దా తేడా లేకుండా అండరూ పాలను తాగాలని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే పాలలో చక్కెర కలపకుండా కొన్ని కిస్మిస్లను వేసి బాగా మరిగించి అనంతరం ఆ పాలను తాగాల్సి ఉంటుంది. ఇలా పాలలో కిస్మిస్లను వేసి మరిగించి తాగడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కిస్మిస్ పాలను తాగితే అనేక వ్యాధులు నయం అవుతాయని వారు అంటున్నారు.
కిస్మిస్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల కిస్మిస్లను పాలలో వేసి మరిగించి తాగితే ఐరన్ ను పొందవచ్చు. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. నీరసం, అలసట తగ్గుతాయి. కిస్మిస్లను పాలలో వేసి మరిగించి రాత్రి పూట తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. శరీరంలో ట్రిప్టోఫాన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది నిద్రను ప్రేరేపించే హార్మోన్. కనుక రాత్రి పూట కిస్మిస్ పాలను తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అయి నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. నాడీ మండల వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచే సరికి చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు. రోజంతా శక్తిస్థాయిలు అధికంగా ఉంటాయి. యాక్టివ్‌గా పనిచేస్తారు.
పాలలో కిస్మిస్లను వేసి మరిగించి తాగితే ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందువల్ల పాలను ఇలా తాగితే ఎముకలు, దంతాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కిస్మిస్లలోనూ అధిక మొత్తంలో క్యాల్షియం ఉంటుంది. దీంతోపాటు బోరాన్ కూడా లభిస్తుంది. అందువల్ల కిస్మిస్లను పాలలో వేసి మరిగించి తాగితే పెద్ద మొత్తంలో క్యాల్షియంను పొందవచ్చు. దీంతోపాటు బోరాన్ కూడా లభిస్తుంది కనుక ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
కిస్మిస్ పాలను తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ అధికంగా లభిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేలా చేస్తాయి. దీంతోపాటు విటమిన్లు, మినరల్స్‌ను కూడా మనం పొందవచ్చు. ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో ఇన్ ఫెక్షన్లు తగ్గిపోతాయి. కిస్మిస్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. కిస్మిస్లలో ఉండే ఫైబర్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఇలా కిస్మిస్లను వేసి మరిగించిన పాలను తాగుతుంటే అనేక లాభాలను పొందవచ్చు.