Goat Milk | పాలు.. ఈ పేరు చెప్పగానే మనకు ఆవు పాలు లేదా గేదె పాలు గుర్తుకు వస్తాయి. చాలా మంది తమ అభిరుచిని బట్టి ఆవు లేదా గేదె పాలను వాడుతుంటారు. వాటితో తయారు చేసిన పెరుగు, నెయ్యి వంటివి తింటుంటారు. అయితే వాస్తవానికి ఇవి రెండే కాదు, మనం మేక పాలను కూడా సేవించవచ్చు. ఇవి కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే మేక పాలను తాగాలా.. వద్దా.. అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. కానీ మేక పాలను తాగవచ్చని, వీటితో ఎలాంటి దుష్పరిణామాలు కలగవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందిన ప్రజలు మేక పాలను తాగుతుంటారు. మేక పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు సహాయం చేస్తాయి.
మేక పాలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఆవు లేదా గేదె పాలు కొందరికి సరిగ్గా జీర్ణం కావు. అలాంటి వారు మేక పాలను సేవించవచ్చు. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి. పోషకాలు సులభంగా లభిస్తాయి. మేక పాలలో లాక్టోస్ సైతం చాలా తక్కువగా ఉంటుంది. కనుక పాలు అంటే అలర్జీ ఉన్నవారు మేక పాలను తాగవచ్చు. మేక పాలతో తయారు చేసిన పెరుగు సైతం ఎంతో రుచిగా ఉంటుంది. ఇది తేలిగ్గా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. పొట్టలో అసౌకర్యం ఉన్నవారు ఈ పెరుగును తింటే ఉపయోగం ఉంటుంది. మేక పాలను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిలో హై క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తులకు దోహదం చేస్తాయి. మేక పాలలో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆవు పాల కన్నా అధిక మొత్తంలో క్యాల్షియం మేక పాలలోనే ఉంటుంది. కనుక ఎముకలు బలంగా ఉండాలనుకునే వారు మేక పాలను తాగుతుంటే మేలు జరుగుతుంది.
మేక పాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. నాడులు, కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో కండరాలు ప్రశాంతంగా మారుతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మేక పాలలో అధికంగా ఉండే మెగ్నిషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నాడుల పనితీరును మెరుగు పరుస్తుంది. ఈ పాలలో ఉండే సెలీనియం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం మేక పాలలో ఉండే ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. మేక పాలలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. దీంతోపాటు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తాయి.
ఆవు లేదా గేదె పాలు అంటే కొందరికి అలర్జీ ఉంటుంది. కారణం ఆ పాలలో ఉండే ఎ1 కెసిన్ అనే ప్రోటీన్ పదార్థమే. అయితే మేక పాలలో ఎ2 కెసిన్ ఉంటుంది. కనుక మేక పాలను తాగితే అలర్జీ సమస్య ఉండదు. సాధారణ పాలు అంటే పడని వారు కూడా మేక పాలను సేవించవచ్చు. మేక పాలతో సబ్బులను సైతం తయారు చేస్తారు. ఇవి మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక చర్మానికి తేమను అందిస్తాయి. దీని వల్ల చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఈ పాలలో అధికంగా ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇక మేక పాలను సాధారణ పాలలాగే తీసుకోవచ్చు. బాగా మరిగించి తాగాల్సి ఉంటుంది. లేదా మీరు వాటితో టీ, కాఫీ తయారు చేసి కూడా తాగవచ్చు. పెరుగు తయారు చేసి తినవచ్చు. ఇలా మేక పాలతో అనేక లాభాలను పొందవచ్చు.