Curd With Sugar | పెరుగును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. భోజనం చివర్లో పెరుగుతో తినకపోతే చాలా మందికి భోజనం చేసిన ఫీలింగ్ కలగదు. కనుకనే అధిక శాతం మంది పెరుగన్నం తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే పెరుగులో చక్కెర కలిపి తినడం కూడా చాలా మందికి అలవాటు. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన ప్రజలు ఇలా ఎక్కువగా తింటారు. వారు మజ్జిగలో చక్కెర కలిపి దానికి లస్సీ అని పేరు పెట్టి తాగుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పలు వర్గాలకు చెందిన ప్రజలు కూడా పెరుగులో చక్కెర కలిపి తింటుంటారు. అయితే పెరుగులో చక్కెర కలిపి తింటే అనేక లాభాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల పలు పోషకాలు లభించడంతోపాటు పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చని వారు అంటున్నారు.
పెరుగు ప్రో బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా పెరుగును పులిసేలా చేస్తుంది. దీంతో పెరుగులో పోషక విలువలు పెరుగుతాయి. పెరుగులో లాక్టో బేసిల్లస్, బైఫైడో బాక్టీరియం అనే మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం, మలబద్దకం, అసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్గా ఉంటారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట ఉండవు. ఎంత పనిచేసినా అలసట రాదు. రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి.
పెరుగులో హై క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల దీన్ని తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. శరీరం విధులు సక్రమంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయి. పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాలు, నాడుల పనితీరును మెరుగు పరుస్తుంది. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. కనుక వేడి వాతావరణంలో ఉండే వారు తింటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. వేడి నుంచి బయట పడవచ్చు. శరీరంలో ఉండే వేడి తగ్గి శరీరం చల్లగా మారుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
అయితే పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని మోతాదులోనే తినాలి. చక్కెరను మరీ అతిగా కలపకూడదు. లేదంటే శరీరంలో క్యాలరీలు అధికంగా చేరుతాయి. దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు చక్కెరను వాడకూడదు. కానీ పెరుగును తినవచ్చు. అయితే కొవ్వు తీసిన పెరుగును తింటే మంచిది. ఇక అధిక బరువు తగ్గాలని చెప్పి డైట్లో ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని తినకపోవడమే మంచిది. అలాగే కొందరికి పాలు, పాల ఉత్పత్తులు పడవు. లాక్టోస్ ఇన్టాలరెన్స్ ఉంటుంది. అలాంటి వారు ఈ మిశ్రమాన్ని తినకూడదు. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని తినకూడదు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ పెరుగు, చక్కెర మిశ్రమాన్ని తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.