హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని భాగ్యగనర్ టీఎన్జీవో సొసైటీ భూమి వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో త్వరలో కౌంటర్ పిటిషన్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయి దా వేస్తూ జస్టిస్ కే లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ ప్రభుత్వం గోపన్నపల్లి సర్వే నంబర్ 36లో ఏపీ ఎన్టీవోలకు 182 ఎకరాలు ఇచ్చింది. 2014 లో ఆ భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీ నం చేసుకోవడంతో ఉద్యోగులు కోర్టులో సవాలు చేశారు. అప్పటికే అక్కడ రూ.18 కోట్లతో లేఔట్ వేసి కొందరికి ప్లాట్లు కూడా కేటాయించారు. ఈ కేటాయింపులో సీనియార్టీ వివాదం తలెత్తడంతో వ్యవహారం కోర్టుకు చేరింది.
ఆ భూమి థర్డ్ పార్టీలకు దకకుండా చర్యలు చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే నంబర్ 36లో తమకు 17 ఎకరాల భూమి ఉన్నదని, సుప్రీంకోర్టులో కేసు గెలిచామని వినాయక్‌నగర్ హౌసింగ్ సొసైటీ వాదిస్తున్నది. ఈ వివాదం కోర్టులో ఉండగానే జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్‌కు కలెక్టర్ రాసిన లేఖ మరో వివాదానికి తెరతీసింది. ఆ భూమిలో ప్రైవేట్ స్థలాలు ఉన్నాయని పేర్కొంటూ.. వాటి రిజిస్ట్రేషన్లకు వీలుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగా కలెక్టర్ లేఖ చెల్లదని భాగ్యనగర్ టీఎన్జీవో చెప్తున్నది. ఈ క్రమంలో భాగ్యనగర్ టీఎన్జీవో సంఘం వేసిన ప్రధాన పిటిషన్లో వినాయక్‌నగర్ సొసైటీ ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. అప్పటి నుంచి కొనసాగుతున్న వివాదంలో ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు.