ఖలీల్‌వాడి, మే 3 : ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలను కొంటారో.. కొనరో ? సూటిగా చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా, ఈ ఇందిరమ్మ రాజ్యానికి ఇసుమంత కనికరం కూడా లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని, ఏ రైతును కదిపినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
రోడ్లు, కల్లాల్లో ధాన్యం ఎండకు ఎండుతూ తూకం తగ్గుతున్నదని, అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నదని తెలిపారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అన్నదాత శ్రమ ఆవిరవుతున్నదని పేర్కొన్నారు. డొంకేశ్వర్, ఆలూర్, నందిపేట్, ఆర్మూర్ రూరల్ తదితర మండలాల్లో రైతులు ఎక్కువగా వరి పంట పండించారని, ధాన్యం కొనే దిక్కు లేక దైన్య స్థితిలో ఉన్నారని తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని జీవన్‌రెడ్డి విమర్శించారు. అటు ఐకేపీ, ఇటు సొసైటీలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, కల్లాలపై ధాన్యం రాసులు మాత్రం అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. ధాన్యం కొనేందుకు అనేక కొర్రీలు పెడుతూ, రైతులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం అమ్ముడుపోక రైతులు నానా అవస్థలు పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదని ధ్వజమెత్తారు.
క్షేత్రస్థాయిలో దయనీయ పరిస్థితి నెలకొన్నదని, పంటల కొనుగోలుపై సర్కారు మాటలు నీటిమూటలేనని అర్థమవుతున్నదని జీవన్‌రెడ్డి విమర్శించారు. చివరి గింజ వరకు కొంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అదే అరిగిపోయిన రికార్డును పదేపదే వినిపిస్తున్నా, ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవని తెలిపారు. గన్నీ సంచులు, కాంటాలు, లారీలు కనిపించడంలేదని పేర్కొన్నారు. మద్దతు ధర ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే, రైతాంగం ఆందోళన బాట పట్టక తప్పదని స్పష్టం చేశారు. అన్నదాతల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవి చూడక తప్పదని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.