– భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరకొరగా రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లు
– జిల్లా ముస్లిం జనాభా 63,439
– మంజూరైన గిఫ్ట్ ప్యాక్‌లు కేవలం 4 వేలు మాత్రమే
– మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా
రుద్రంపూర్, మార్చి 12 : రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అరకొరగా గిఫ్ట్ ప్యాక్‌లు ముంజూరు చేయడం జరిగిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలలో 63,439 ముస్లిం జనాభా ఉండగా కేవలం 4 వేల మందికి మాత్రమే గిఫ్ట్ ప్యాకెట్లు మంజురైనట్లు వెల్లడించారు. ఇందులో కొత్తగూడెం నియోజకవర్గంలో ముస్లిం జనాభా 28,679 మంది ఉండగా కేవలం 1,250 , ఇల్లెందులో 11,022 మంది ఉండగా 750, భద్రాచలంలో 3,807 మంది ఉండగా కేవలం 500, పినపాకలో 12,152 మంది ఉండగా 750, అశ్వారావుపేటలో 7,779 మంది ఉండగా 750 గిఫ్ట్ ప్యాక్ లు మంజూరవ్వడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 149 మసీదులు ఉండగా అందులో 16 మసీదులకు ఒక్కో మసీదు రూ.లక్ష చొప్పున, రూ.16 లక్షలు మాత్రమే ఇఫ్తార్ దావత్ లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని మిగతా మసీదు పరిధిలో గల పేద ముస్లింలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్ర ముస్లిం మైనారిటీల పక్షాన ఉంటామని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం చేస్తుందే తప్పా ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని, ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైఖరి ముస్లింల మద్య చిచ్చు పెట్టేలా ఉందని, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించి భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని యాకూబ్ పాషా కోరారు.