న్యూఢిల్లీ, నవంబర్ 25: నష్టాలబాటలో ఉన్న కంపెనీల్ని, ఖాయిలా కంపెనీలను మాత్రమే విక్రయిస్తామంటూ చెపుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ లాభాల్ని ఆర్జిస్తున్న దిగ్గజ సంస్థల్నీ వదలడం లేదు. ఏదో రకంగా కంపెనీల వాటాల్ని అమ్మకానికి పెట్టి డబ్బు గుంజడమే లక్ష్యంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నది. ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు గనుల కంపెనీ అయిన కోల్ ఇండియాను, జింక్ లోహం తయారీలో ఆసియాలోకెల్లా భారీ కంపెనీ అయిన హిందుస్థాన్ జింక్‌ను, దేశంలో ప్రధాన ఎరువుల తయారీ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్)ను ఇందుకు ఎంచుకున్నట్టు సంబంధిత అధికారుల్ని ఉటంకిస్తూ బ్లూంబెర్గ్ వార్తా సంస్థ శుక్రవారం ఒక కథనంలో పేర్కొంది. వీటిలో 5 శాతం నుంచి 10 శాతం వరకు వాటాను ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం విక్రయిస్తే రూ.16,500 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సమకూరుతాయని అంచనా. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఈ కంపెనీలతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ అధీనంలోని ఒక లిస్టెడ్ కంపెనీ, మరో పీఎస్‌యూ కూడా ఈ వాటాల విక్రయ జాబితాలో ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లు (ఎఫ్‌పీవోలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం 2023 జనవరి-మార్చిలో మార్కెట్లో ప్రవేశిస్తాయని అంటున్నారు.
రోడ్ షోలు ప్రారంభం
ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిపాదిత షేర్ల విక్రయాలకు సంబంధించి ఇన్వెస్టర్ల ఆసక్తిని తెలుసుకునేందుకు ఇప్పటికే రోడ్‌షోలు ప్రారంభించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. గత ఏడాదిగా కోల్ ఇండియా షేరు ధర 46 శాతం, హిందుస్థాన్ జింక్ షేరు ధర 58 శాతం చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ పెరిగింది 6 శాతమే. షేర్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వాటాల్ని సొమ్ము చేసుకునేందుకు చూస్తున్నదని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఎల్ఐసీ, పేటీఎం పబ్లిక్ ఇష్యూలకు ముందు దేశంలో అతిపెద్ద ఐపీవో జారీచేసిన ఘనత కోల్ ఇండియాదే. ఇప్పుడు ఈ సంస్థలో కేంద్రానికి 66.13 శాతం వాటా, ఆర్సీఎఫ్లో 75 శాతం వాటా ఉంది. మరో సంస్థ హిందుస్థాన్ జింక్‌ను గత వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే మెజారిటీ వాటాను వేదాంత గ్రూప్‌కు విక్రయించగా, అందులో కేంద్రానికి ఇంకా 29.58 శాతం వాటా ఉంది. ఈ మిగులు వాటాలో కొంత భాగాన్ని ఎఫ్‌పీవోలో ఆఫ్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
డిజిన్వెస్ట్‌మెంట్, ద్రవ్యలోటు లక్ష్యాల కోసమే
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రూ.65,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం సుదూరంలో నిలిచిపోయినందున, లాభదాయక వాటాల్ని మార్కెట్లో హడావుడిగా అమ్మివేసేందుకు ఆరాటపడుతున్నది. ఈ లక్ష్యంలో మూడో వంతు మాత్రమే ఇప్పటివరకూ సమీకరించగలిగింది. అందు లో అధికభాగం (రూ.21,000 కోట్లు) ఈ ఏడాది మే నెలలో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లను విక్రయించడం ద్వారా వచ్చినవే. బీపీసీఎల్, ఐడీబీఐ బ్యాంక్ తదితరాల్ని ప్రైవేటుకు విక్రయించే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో కమోడిటీ బూమ్ నేపథ్యంలో కోల్ ఇండియా, హిందుస్థాన్ జింక్, ఆర్సీఎఫ్ వాటాల్ని విక్రయించేందుకు ప్రభుత్వం చూస్తున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన సబ్సిడీల భారంతో పెరుగుతున్న ద్రవ్యలోటును లక్ష్యాన్ని 6.4 శాతానికే పరిమితం చేయాలన్నా, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం నెరవేరాలన్నా మరో నాలుగు నెలల్లో కేంద్ర ఖజానాకు సొమ్ము కావాలి. అందుకే లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రభుత్వం గురిపెట్టిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.