Pulivendula | పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసు నుంచి తొలగించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డీజీపీ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
సీఐ శంకరయ్య సమక్షంలోనే వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు ఆధారాలను చెరిపివేశారని గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారని.. సీఎం చంద్రబాబు నాయుడికి శంకరయ్య లీగల్ నోటీసులు పంపించారు. అసెంబ్లీ వేదికగా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలన్నారు. ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మాజీ సీఐ శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.