ICC : అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న అమెరికా క్రికెటర్ బొడుగుమ్ అఖిలేష్ రెడ్డి(Akhilesh Reddy) చిక్కుల్లో పడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అవినీతి నియమావళి(Anti Curruption Code)ని పలుమార్లు ఉల్లంఘించినందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అవినీతితో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిపై నిషేధం విధించింది ఐసీసీ. ఇటీవల కాలంలో అతడిపై నమోదైన అవినీతి కేసుల గురించి ఐసీసీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే అఖిలేష్‌పై వేటు పడింది.
అబుధాబీ టీ10 టోర్నమెంట్లో అఖిలేష్ రెడ్డి ప్రవర్తన పట్ల ఐసీసీ విచారణ చేపట్టింది. ఎమిరేట్స్ క్రికెట్ తరఫున ఐసీసీ అవినీతి నిర్మూలన బాధ్యతలు తీసుకుంది. ఇప్పటివరకూ అతడిపై మూడు అవినీతి కేసులు నమోదయ్యాయి. అబుధాబీ టీ10 టోర్నమెంట్లో మ్యాచ్‌లను ప్రభావితం చేసేందుకు అఖిలేష్ ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ అమెరికా స్పిన్ సంచలనం ఆర్టికల్ 2.1.1ను ఉల్లంఘించాడు.
USA cricketer Bodugum Akhilesh Reddy has been charged with three violations of the ICC Anti-Corruption Code.
— ICC (@ICC) November 21, 2025
మ్యాచ్ ఫిక్స్ చేసేందుకు, మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు అతడు ప్రయత్నించాడు. అంతేకాదు మరికొందరిని కూడా తనలా అవినీతికి పాల్పడమని ప్రోత్సహించాడు. అవినీతి దర్యాప్తుకు సహకరించకుండా అతడు తన మొబైల్లోని డేటా, మెసేజ్‌లను తొలగించాడు. ఈ నేపథ్యంలోనే అఖిలేష్‌పై ఐసీసీ నిషేధం విధించింది. నవంబర్ 21 నుంచి 14 రోజుల పాటు అతడిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ఐసీసీ పేర్కొంది.