చండ్రుగొండ, నవంబర్ 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అడ్డంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలను తెలియజేస్తూ అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో ఇది పాఠశాలనా లేక అధికార పార్టీ కార్యాలయమా? అంటూ తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలు విద్యనభ్యసించే పాఠశాలకు అడ్డంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అవివేకమని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలకు అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని కోరుతున్నారు.