న్యూఢిల్లీ: 3I/ATLAS అనే తోకచుక్క అంతుచిక్కనీ రీతిలో ప్రవర్తిస్తున్నది. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు తీవ్ర మేధోమథనంలో పడ్డారు. మిస్టీరియస్‌గా మారిన ఆ తోకచుక్కను సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. క్రమంగా ఆ పదార్ధం తన వేగాన్ని పెంచుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అది రంగు కూడా తీవ్ర స్థాయిలో మార్చుకున్నట్లు పసికట్టారు. చిలీలో ఉన్న టెలిస్కోప్ ద్వారా ఆ తోకచుక్క జూలైలో మొదటిసారి గుర్తించారు. అయితే మన సౌర వ్యవస్థ అవతల ఉన్న అతిధిగా దీన్ని భావిస్తున్నారు.
ప్రస్తుతం 3I/ATLAS తోకచుక్క వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని ఖగోళ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. డిసెంబర్లో ఆ తోకచుక్క భూమికి దగ్గరగా వెళ్లనున్నది. సుమారు 269 మిలియన్ల కిలోమీటర్ల దూరం నుంచి ఆ ఆబ్జక్ట్ వెళ్లనున్నది. అక్టోబర్ 29వ తేదీన ఆ తోకచుక్క మరింత కాంతివంతంగా కనిపించింది. సూర్యుడి దగ్గరికి సమీపిస్తున్న కొద్దీ.. బ్లూ రంగులో మెరిసిపోయింది.
ఆ తోకచుక్క ప్రస్తుతం గంటకు 2,44,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. సూర్యుడి ఆకర్షణ వల్ల ఆకస్మికంగా దానికి మరింత కిక్ వచ్చిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 3I/ATLAS కు నాన్ గ్రావిటేషన్ యాక్సిలరేషన్ వచ్చినట్లు నాసా జేపీఎల్ నావిగేషన్ ఇంజినీర్ డేవిడ్ ఫర్నచ్చియా తెలిపారు. తోకచుక్కలో ఉన్న వాయువు తగ్గడం వల్ల దాని వేగం పెరిగినట్లు హార్వర్డ్ ఆస్ట్రోఫిజిస్ట్ అవి లోబ్ తెలిపారు. నెల రోజుల్లోనే పదో వంత బరువును ఆ తోకచుక్క కోల్పోతుందన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆ చుక్క వెంట వాయువు క్షేత్రం కనిపిస్తుందన్నారు.
మరో సౌర వ్యవస్థకు చెందిన మూడవ పదార్ధం ఇది. అందుకే దీనికి 3 అని, ఐ అంటే ఇంటర్స్టెల్లార్ అని , అట్లాస్ అంటే ఆస్టరాయిడ్ టెరస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అని ఆ తోకచుక్కకు పేరు పెట్టారు.