ఇల్లెందు, నవంబర్ 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వర్లు తన కుమార్తె అంజలి (19) ని అదే గ్రామానికి చెందిన చిట్టూరి సాయికుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి 6 నెలల క్రితం (మే 14) న వివాహం చేశాడు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో ఉంటుండగా అత్తమామల దగ్గర ఉంటున్న అంజలి కుటుంబ కలహాలతో నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం గమనించిన అత్తింటి వారు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ప్రవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అంజలి సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంతో ఆశతో సొంత గ్రామానికి చెందిన అబ్బాయికి భూమి, వరకట్నం లక్షల్లో, బంగారం పెట్టి ఘనంగా వివాహం నిర్వహించిన కూతురు జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో లచ్చగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంజలి తండ్రి వెంకటేశ్వర్లు ఇల్లెంద్ పోలీస్ స్టేషన్లో అత్తింటి వారిపై ఫిర్యాదు చేశాడు.