– గురుకుల టీచర్స్ హక్కుల ఐక్యవేదిక ప్రెసిడెంట్ కొండ్రపల్లి శ్రీను
దేవరకొండ రూరల్, ఫిబ్రవరి 20 : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (డీఎల్), లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్ట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు డీఎల్ పోస్టులకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు తలనొప్పిగా, ఇబ్బంది పరిణమించాయని గురుకుల టీచర్స్ హక్కుల ఐక్యవేదిక ప్రెసిడెంట్ కొండ్రపల్లి శ్రీను అన్నారు. రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (డీఎల్), లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు భాగాలుగా విభజించింది. అభ్యర్థుల ప్రతిభను 100 మార్కులకు లెక్కగట్టి ఎంపిక చేస్తారు. అయితే గతంలో కేవలం రాత పరీక్షకే వంద శాతం మార్కులు ఉండేవి. కాగా ఈసారి దాన్ని మార్చారు. అకడమిక్ స్కోర్ కు 50 శాతం వెయిటేజీ, సబ్జెక్ట్ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించే రాత పరీక్షకు 40 శాతం వెయిటేజీ, అలాగే వ్యక్తిగత ఇంటర్వ్యూకు 10 శాతం మార్కులు కేటాయించింది.
దీనిపై కొండ్రపల్లి శ్రీను స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయంతో నిరుపేద, గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగనుందన్నారు. చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వాళ్లు అకాడమిక్ లో తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులను ,పట్టణ ప్రాంత అభ్యర్థులతో పోల్చినప్పుడు ఇంగ్లీష్ మీద పట్టు తక్కువగానే ఉంటుంది, వీరు మాతృభాషలో డిగ్రీ వరకు విద్యను అభ్యసించి ఉంటారు కావున వీరికి అకాడమిక్ లో తక్కువ స్కోరు ఉంటుందన్నారు. అంతేకాకుండా డీఎల్ నియామకాల్లో ఇంటర్వ్యూ పెట్టడం వల్ల అవినీతికి, పక్షపాతానికి తావు ఉంటుందన్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ నియమాకాల్లో ఇంటర్వ్యూలు రద్దుచేసి కేవలం రాత పరీక్ష ద్వారానే ఉద్యోగ ఎంపిక చేయాలని కోరారు.
ఇటీవల చేపట్టిన గ్రూప్-1, గ్రూప్ -2, జేఎల్కు ఎటువంటి ఇంటర్వ్యూ నిర్వహించలేదన్నారు. గ్రూప్-1, గ్రూప్ – 2, జనరల్ జేఎల్ కి లేనటువంటి ఇంటర్వ్యూ కేవలం డీఎల్ కి పెట్టడంలో ఉన్న అంతర్యం ఏమిటి ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు?. గత గురుకుల జేఎల్, డీఎల్ నియామకాల్లో ఇంటర్వ్యూలు పెట్టడం వల్ల కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందనే వాదనలు కూడా ఉన్నాయన్నారు. కావున పాత పద్ధతిలోనే అనగా రాత పరీక్ష ద్వారానే ప్రభుత్వ జీఓ ఎం.ఎస్. నెంబర్ 47 ప్రకారమే డీఎల్ నియామకాలు వంద శాతం రాత పరీక్ష ద్వారానే ఎంపిక జరగాలని కోరారు. వెంటనే డీఎల్ పోస్టులలో ఇంటర్వ్యూను ఎత్తివేసి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.