Narsimhulapeta | నర్సింహులపేట, మార్చి 9: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలు దాటినా కార్యాలయానికి ఒక్క అధికారి కూడా రాలేదని మండిపడుతున్నారు.
అధికారులు సమయానికి రాకపోవడంతో వివిధ పనుల మీద గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎంపీడీవో కార్యాలయం వద్ద వేచిచూడాల్సి వస్తుంది. కేవలం తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి హాజరయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో కీలక పాత్ర పోషించే ఎంపీడీవో, ఎంపీ ఓ, సూపర్డెంట్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ సైతం సమయపాలన పాటించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని చెప్పవచ్చు.
గత కొద్ది రోజులుగా అధికారుల సమయపాలన తీరు ఇదే విధంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పలు సార్లు అధికారులను, కార్యాలయ సిబ్బందిని వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెబుతున్నారు.