సిద్దిపేట,మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోహిణి కార్తెలోనే వర్షాలు పడుతున్నాయి. రోహిణిలో విత్తనం విత్తుతే అధిక పంట దిగుబడి వస్తుంది అని రైతుల నమ్మకం. వారం రోజుల నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు సాగు చేద్దామంటే..ఇప్పటి వరకు ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో పడలేదు. వానకాలం సాగుకు విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో భూమిలో సారం పెరగటానికి, పంట దిగుబడి ఎక్కువ రావడానికి జీలుగ విత్తనాలు, జనుము, పెసరను ముందుగా సాగు చేస్తారు. గతేడాది కన్నా ఈ సంవత్సరం జీలుగ, జనుము విత్తనాల ధరలను రాష్ట్ర ప్రభుత్వం అధికం చేసింది. దీంతో రైతుల మీద మరింత భారం పడునున్నది. జీలుగ విత్తనాలు గత ఏడాది 30 కిలోల బ్యాగుకు రూ. 1120 తీసుకున్నారు. ఈ ఏడాది ప్రస్తుత వానకాలంలో అదే 30 కిలోల బ్యాగుకు రూ. 2140 తీసుకుంటున్నారని రైతు లు చెబుతున్నారు.
ఒక్క బ్యాగు మీద రూ. 1020 భారం పడుతుంది. ఇక జనుము విషయానికి వస్తే గత సంవత్సరం 40 కిలోల బ్యాగుకు రూ. 1400 ఉండగా ఈ ఏడాది దాని ధర రూ.2510 పెంచారు.ఇక్కడ ఒక్క బ్యాగు మీద రూ .1110 పెరిగింది. ఇలా ప్రతి దాని ధరలు పెంచి రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం బారం వేస్తుందని రైతులు మండి పడుతున్నారు. పిల్లిపెసర ఒక కేజీకి రూ.100 ఉంది. జీలుగ, జనుము, పిల్లిపెసర ఇవన్నీ భూమిలో సారం పెరగడానికి ఉపయోగ పడుతున్నాయి.
దీంతో రైతులు విత్తనాల కోసం ఆగ్రో సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో లేక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పగలు, రాత్రుళ్లు విత్తనాల కోసం దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. విత్తనాలు దొరకక ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కనీసం జిల్లాకు చెందిన మంత్రులు వానకాలం సాగుపై కనీస సమీక్షలు చేయకపోవడంతో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవు. రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్షకులు మండి పడుతున్నారు.
జీలుగ, జనుము విత్తనాల కోసం సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట క్యూలో రైతులు తమ పాస్‌బుక్కులు పెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాఫీగా విత్తనాలు అందింతే ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్నీ కష్టాలే మొదలయ్యాయి. విత్తనాల నుంచి పంట చేతికి వచ్చి దానిని అమ్ముకునేదాకా రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఎరువులు, విత్తనాల జాడ లేదు
వానకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల రైతులు తమ భూములను సిద్ధం చేస్తున్నారు. రోహిణి కార్తెలో విత్తనాలు వేస్తే పంట అధిక దిగుబడి వస్తుంది. ఆదిశగా రైతులు తమ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచలేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట రైతులు విత్తనాల కోసం రోడ్డెక్కుతున్నారు.
జిల్లాకు సరిపడే విధంగా ముందస్తు ప్రణాళిక ఇప్పటి వరకు లేదు. రిపోర్టు చెప్పడానికి కాగితాలు ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడంతో గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దళారులు దోచుకుంటున్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అంట గడుతున్నారు.బ్లాక్‌లో నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు విఫలమవుతున్నారు. పేరుకు ఏదో ఒక్క షాపును విజిట్ చేసి మమ అనిపిస్తున్నారు తప్పా ఎక్కడా కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు కనిపించడం లేదు.
దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. అదును దాటితే అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాదని ..రోహిణి కార్తెలోనే వరినార్లు పోసే పనిలో రైతులు ఉన్నారు. రోహిణి కార్తెలోనే వర్షాలు పడడంతో ఒక్కసారిగా వాతావారణం చల్లబడింది. రైతులు దుక్కులు సి ద్ధం చేస్తున్నారు.ట్రాక్టర్లు, ఎద్దుల నాగళ్లతో దుక్కు లు దున్నుతున్నారు. పశువుల ఎరువులు వేయ డం తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా రైతాంగానికి అవసరమైన మేర విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం వి ఫలమైంది. సమైక్య రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు కావాలంటే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మళ్లీ అవే రోజులు గుర్తుకు వస్తున్నాయి.