పటాన్చెరు రూరల్, జూలై 23 : సంగారెడ్డి జిల్లా చిట్కుల్లోని సర్వేనెంబర్ 329లోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణకు గురవుతున్నది. పటాన్చెరు మండలం చిట్కుల్లోని సర్వే నెంబర్ 329లో తిరిగి ఆక్రమణదారులు కబ్జాల పర్వం ప్రారంభించారు. వరుస సెలవులు రావడంతో చకచకా నిర్మాణాలు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో కబ్జాదారులు ఇదే సర్వే నెంబర్లో భారీగా ఆక్రమణలు చేసి ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ భూమిలో 2008లో ఇచ్చిన ఇండ్ల పట్టాలను చూపుతూ పలువురు ఆ ప్లాట్లలో ఇండ్ల నిర్మాణం చేపట్టారు. గతేడాది డిసెంబర్ నెలలో, ఈ ఏడాది జనవరిలో నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనాలు రావడంతో మేలుకొన్న అధికారులు ఆ ఇండ్ల నిర్మాణాలను నిలిపివేశారు.
రాత్రికి రాత్రి కొందరు నిర్మాణాలు జరుపుతుంటే తహసీల్దార్ రంగారావు స్వయంగా వారిని నిలువరించి మేస్త్రీలను బైండోవర్ చేశారు. ఆ తర్వాత పనులు నిలిచిపోయాయి. 2008లో అప్పటి మంత్రి దామోదర రాజనర్సింహ చిట్కుల్ గ్రామస్తులకు పంపిణీ చేసిన ఇండ్ల పట్టాల్లో ఆ కాలంలోనే అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు ఎంక్వైరీ చేసిన ప్రభుత్వ అధికారుల బృందం, గ్రామస్తులు కానివారికి, పేదవారి ప్లాట్లు కొన్నవారిని గుర్తించి ఇండ్ల పట్టాలను రద్దు చేశారు. రద్దు చేయబడిన ప్లాట్ల పత్రాలతో ఇప్పటికీ నిర్మాణాలు చేసేందుకు కబ్జాదారులు చూస్తున్నారు. ఆ పాత పట్టాలే కొందరు నాయకులు కొనివా టిని అమ్ముకుంటున్నారు. తెరవెనుక నాయకులు కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. చిట్కుల్లో ఈ సర్వే నెంబర్లో ప్రస్తుతం పది వరకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ భూమిలో చెల్లుబాటు కాని పట్టా పత్రాల పేరున ఆక్రమణలు చేసి నిర్మిస్తున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు జారీచేశారనే ఆరోపణలు ఉన్నాయి. గత పంచాయతీ పాలకమండలి కేటాయించినట్టుగా చెబుతూ ఇండ్లకు నెంబర్లు తెచ్చుకున్నారని ప్రచారంలో ఉంది. ఏడు నెలల క్రితం చిట్కుల్ గ్రామ పంచాయతీని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ ద్వారా ఇంటినెంబర్లకు దరఖాస్తు చేయాలి. ప్రభుత్వ సర్వే నెంబర్లలో అలా చేయడం అసాధ్యం. ఇదే అదునుగా కొంతమంది పంచాయతీ సిబ్బంది సర్వేనెంబర్ 329లో రాత్రికి రాత్రి కబ్జాచేసి కడుతున్న ఇండ్లకు ఇంటి నెంబర్లను ఇస్తున్నారని తెలిసింది.
మరోవైపు ఈ ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు సైతం ఒప్పందాలు జరుగుతున్నట్లు తెలిసింది. పూర్తయిన ఇండ్లకు నీటి కనెక్షన్ ఇచ్చేందుకు సైతం లోపాయికారి ఒప్పందాలు జరిగినట్టు సమాచారం. భారీ మొత్తంలో లంచాలు తీసుకుని ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చిట్కుల్లో ప్లాట్ల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే అదునుగా భావించిన నాయకులు, కబ్జాదారులు రద్దు చేయబడిన పట్టా కాగితాలను తెరపైకి తెచ్చి కబ్జాలు చేయిస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిఘా కరువు కావడంతో కబ్జాదారులు రాత్రికి రాత్రి నిర్మాణాలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఇస్నాపూర్ మున్సిపల్ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తుండడం విమర్శలకు, అనుమానాలకు తావిస్తున్నది.